హైదరాబాద్ నుంచి 168 మంది అమెరికన్ల తరలింపు
లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకున్న విదేశీయులను రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా ప్రత్యేక విమాన సర్వీసుల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా రెండు ప్రత్యేక విమానాల్లో 168 మంది అమెరికా దేశస్థులను తరలించారు. భారత్ పర్యటన కోసం వచ్చిన అమెరికా దేశస్థులు లాక్డౌన్ ప్రకటనతో హైదరాబాద్లో ఉండిపోయారు. వీరిని స్వదేశానికి పంపించాలంటూ అమెరికన్లు ఆ దేశ రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబయి నుంచి రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న 168 మంది అమెరికన్లకు వైద్య పరీక్షలు నిర్వహించి విమానం ఎక్కించారు. అవి ముంబయి మీదుగా అమెరికాకు బయలుదేరినట్లు జీహెచ్ఐఏఎల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.













