హౌడీ మోదీలో.. భారతీయ అమెరికన్ కుర్రాడికి అరుదైన అవకాశం
సెల్ఫీ అంటే ఎవరికైనా సరదానే. అభిమాన వీఐపీలతో సెల్ఫీ చెప్పలేని అనుభూతినిస్తుంది. జీవితంత అదొక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. హౌడీ మోదీ వేడుకలో ఓ భారతీయ అమెరికన్ కుర్రాడికి ఇలాంటి అరుదైన అవకాశం లభించింది. మోడీ, ట్రంప్‌నకు ఆహ్వానం పలికే ప్రత్యేక సాంస్కృతిక కళాబృందంలో ఇతను సభ్యుడు. ఆడిటోరియంలోకి ట్రంప్, మోదీ వస్తున్న వేళ, అగ్రనేతలను దగ్గరగా చూసిన ఆ కుర్రాడు సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. ధైర్యం చేసి ట్రంప్‌ను సెల్ఫీ కోరాడు. ఇందుకు చిరునవ్వుతో అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు మోదీని కూడా దగ్గరకు పిలిచారు. దాంతో వాళ్లిద్దరితో సదరు కుర్రాడు సెల్ఫీ తీసుకున్నాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అక్కడున్న వారంతా సంతోషంతో చిరునవ్వులు చిందించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సెల్ఫీ ఫొటోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేయగా, కొద్ది గంటల్లోనే 40వేల లైకులు వచ్చాయి. ఈ అబ్బాయి ఎంతో అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.













