వైరస్‌ను రెండ్రోజుల్లో చంపేస్తుందట
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక యాంటి వైరల్ ఔషధంతో కరోనా వైరస్‌ను నాశనం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. కొవిడ్-19కు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇవెర్మెక్టివ్ అనే ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స కోసం వాడుతున్నారు. హెచ్ఐవీ, డెంగీ, ఇన్ ప్లూయెంజా, జికా వైరస్ సహా అనేక రకాల సూక్ష్మజీవులపై ఇది సమర్థంగా పనిచేస్తుందని వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన కైలీ వాగ్‌స్టాఫ్ నేతృత్వంలోని బృందం దీన్ని కరోనా వైరస్‌పై ప్రయోగించింది. ప్రయోగశాలలో వృద్ధి చేసిన వైరస్‌ను ఇది రెండ్రోజుల్లో హతమార్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక డోస్‌తో వైరష్కు సంబంధించిన ఆర్ఎన్ఏను 48 గంటల్లో పూర్తిగా నిర్మూలించొచ్చని గుర్తించాం. 24 గంటల్లోనే గణనీయ స్థాయిలో వైరస్ తగ్గిపోయింది అని కైలీ చెప్పారు. అయితే ఈ ప్రయోగాలను ల్యాబ్‌లోనే చేశామని, మానవులపై ఇంకా పరీక్షించాల్సి ఉందని పేర్కొన్నారు.













