అమెరికాలో మన దేవాలయాలు
భారతీయ హిందూ సంస్కృతిలో దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. హిందూ దేశములలో ఏ మూల చూసినను, ఏ కొండపై చూసినను, ఏ నదీ పరిసరములందు, అరణ్యములందు చూసినను దేవతామూర్తులు, దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయములోని దేవుళ్ళనూ చూడాలంటే మనకు రెండు కళ్ళు చాలవని అంటారు. అటువంటి దేవాలయాలను ఖండాతరాల్లో కూడా నిర్మించిన మన ఎన్నారైలను ఎంతో అభినందించాల్సిందే. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన తెలుగువారితో సహా ఎందరో భారతీయులు దేశంలో ఉన్న దేవాలయాలకు ప్రతిరూపంగా తాము ఉన్నచోటనే దేవుడిని ప్రార్థించేందుకు, పూజించేందుకు వీలుగా ఆలయాలను నిర్మించుకున్నారు. ఈ ఆలయాల నిర్మాణం వెనుక పరమార్థం కూడా ఉంది. పైకి సుందరముగా కనిపించి ఆకర్షించినప్పటికీ లోచూపుతో చూస్తే మనకు సత్యశివప్రదమైన భగవంతుడు మనకు కనిపిస్తాడు.
భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి దేవాలయాలు ప్రతిరూపాలుగా భావిస్తున్నాము. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి శాస్త్ర సమ్మిళితమైన దేవాలయాలను సర్వజన హితాన్ని కాంక్షించి, లోకకల్యాణార్థం మన పూర్వీకులు నిర్మించారు. అందుకే భారతదేశం అంటే విదేశీయులకు గుర్తొచ్చేది ఇక్కడి ఆలయాలే. ఈ ఆలయాలు ఐదు రకాలుగా ఉంటాయి. స్వయం వ్యక్తమైన ఆలయాలు, దివ్యం, ఆర్షం, పురాణం, మానుషం అంటూ ఆలయాలను వర్గీకరించారు. స్వయం వ్యక్తం అంటే దేవుడే స్వయంగా ఉద్భవించిన ఆలయాలను స్వయంవ్యక్తం అని అంటారు. బ్రహ్మ,రుద్రాదులు ప్రతిష్ఠించిన ఆలయాలను దివ్యం అంటారు. మహర్షులు ప్రతిష్ఠించిన ఆలయాలను ఆర్షం అంటారు. పురాణ ప్రసిద్ధమైన ఆలయాలను పౌరాణం అని, మనుష్యులు నెలకొల్పిన ఆలయాలను మానుషం పేరుతో పిలుస్తారు. ఈ ఆలయాలను వాస్తుప్రకారం శాస్త్రీయంగా నిర్మిస్తారు. ఇలాంటి ఆలయాలలో శిల్పఆగమలక్షణాలతో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మహనీయుల తపశ్శక్తి చేత పూజలు చేస్తున్న ఈ విగ్రహానికి మహిమాన్వితమైన శక్తి ఉందని అంటారు. ఈ విగ్ర్రహమూర్తిని కొలిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు. వైదిక సంస్కృతీ పరిరక్షణ కేంద్రాలైన ఈ ఆలయాలను పరిరక్షించుకోవడం మన విధి. మన ధర్మం కూడా.. ఈ సంచికలో ఎన్నారైలు కట్టిన అమెరికాలోని దేవాలయాలను అమెరికాలో మనదేవాలయాలు పేరుతో అందిస్తున్నాము.
శివ-విష్ణు ఆలయం (లివర్మోర్ టెంపుల్) – కాలిఫోర్నియా
బే ఏరియాలోని లివర్మోర్ ప్రాంతంలో హిందూ కమ్యూనిటీ మరియు కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో శివ` విష్ణు దేవాలయాన్ని 1977లో ఏర్పాటు చేశారు. ఇందులో శివ, దుర్గాదేవి, బాలాజి, గణేశ్, పార్వతి, కార్తికేయ, రాధాకృష్ణ, సీతారామ, నవగ్రహ, ఆంజనేయ మొదలైన దేవతామూర్తుల ఆలయాలున్నాయి.
ఈ ఆలయ సముదాయం పలు ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు మానవ సేవే మాధవ సేవగా బాలల, యువజనుల, వృద్ధులకై పలు విద్యా, సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. 1983`86 మధ్య తాత్కాలిక దేవాలయ నిర్మాణం చేపట్టి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ దేవాలయం అనతికాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. 1986, 1998, 2010 సంవత్సరాల లోని జులై నెలలో మహాకుంభాషేకం జరుప ుకుంది. ఇతర నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ నేడు అతి పెద్ద దేవాలయంగా అందరినీ ఆకట్టుకుంటోంది.
వివాహ, సీమంతం, శిశోదయ అనంతరం జరిపే పూజలు, జాతకర్మ, నామకరణ, అన్నప్రాసనం, పుట్టు వెంట్రులకు, విద్యాభ్యాసం, ఉపనయనం వంటి పలు హైందవ సంప్రదాయ సంస్కారాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆయుష్య హోమం, షష్ట్యబ్ధిపూర్తి శాంతి, సహస్ర చంద్ర దర్శన శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, వాహన, భూమి పూజలు, గృహప్రవేశం, శ్రాద్ద కర్మలతో పాటు గణపతి, మృత్యుంజయ, రుద్ర, పంచ సూక్త, సుదర్శన, చండీ, శ్రీసూక్త, దుర్గాసూక్త, లలిత సహస్ర నామ, లక్ష్మీ, నవగ్రహ మొదలైన హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలకోసం సదస్సులు, సభలు, సమావేశాలు వంటివాటి కోసం గుడి ప్రాంగణంలో ఉన్న వివిధ సైజుల్లో ఉన్న హాల్స్‌ను రెంటుకు ఇస్తారు. పశ్చిమ వాణి పేరుతో న్యూస్ లెటర్ విడుదల చేస్తున్నారు. అందులో ఒక నెలకు సంబంధించిన ఆలయ కార్యక్రమాలను పేర్కొనడమే గాక, గతనెలలో జరిగిన కార్యక్రమాల వివరలతో పాటు ఛాయా చిత్రాలు (ఫోటోలు) కూడా ఇస్తున్నారు.
-శ్రీమతి తుగ్గుడం అనూరాధ (కాలిఫోర్నియా)
హిందూ టెంపుల్ మరియు కమ్యూనిటీ సెంటర్ – సన్నీవేల్
సన్నివేల్ నగరంలో ఏర్పాటైన దేవాలయం హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్. దీన్ని శ్రీ రాజ్ భానోత్, శ్రీ బల్వంత్ బిర్లా మరియు శ్రీ రాజేందర్ శర్మ, శ్రీ నిరంజి పటేల్ మొదలైన వారు కలిసి సన్నివేల్ ప్రాంతంలో హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ ఆఫ్ సౌత్ బే అనే పేరుతో ఆలయం నిర్మించాలని తలపెట్టి డిసెంబర్, 1991 లో నిర్మాణ పనులు ప్రారంభించారు. వీరితో పాటు ఇంకొందరు ఔత్సాహికులైన ఆధ్యాత్మికవేత్తలు కలిసి ఫేయిర్ ఓక్స ఎవెన్యూ మరియు 237 హైవే ప్రాంతంలో ఉన్న 3.15 ఎకరాల భూమిలో హిందూ మత, సాంఘిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలకై 1993లో ఈ దేవాలయాన్ని నిర్మించాచరు. దీనికి సన్నీవేల్ హిందూ టెంపుల్ మరియు కమ్యూనిటీ సెంటర్‌గా నామకరణం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో ఉత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ గురువుల అభిభాషణం, ప్రఖ్యాతులైన కళాకారులతో భజనలు, పిల్లల కోసం యోగా శిక్షణ, ఆధ్మాత్మిక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని పాలక మండలి నిర్ణయించి మార్చి 23, 2012న భూమిపూజ చేసింది. దేవాలయ ముఖ్య సభ్యులు కొందరు భారత్‌కు వెళ్ళి భారతీయ వివిధ సాంప్రదాయాలకు సంబంధించిన ముప్పయ్ రెండు దేవతా విగ్రహాలను తీసుకువచ్చారు. నిర్మాణ పనులన్నీ 2013 మార్చి 31 వరకల్లా పూర్తై ఇదే సంవత్సరం మే నెలలో 8వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యన విగ్రహా ప్రతిష్ట, విశేష పూజల నిర్వహణతో ఈ ఆలయం మళ్ళీ భక్తులకు అందు బాటులోకి వచ్చింది. ఈ దేవాలయంలో గణేశుడు, శివుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీదేవి, శ్రీ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఇతర విగ్రహాలతో పాటు నవగ్రహాలు కూడా ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. సత్య నారాయణ స్వామి కథ పూజలతో పాటు, వైయక్తికమైన శాంతి హవన్, భూమి, గృహ ప్రవేశం, కార్యాలయ, వాహన పూజలు, అన్నప్రాశన, పుణ్యా వచన, నామకరణ, వివాహ, యజ్ఞోపవీత ధారణ మొదలైన సేవలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేగాక ప్రతీ శని, ఆదివారాలు నెలలోని మొదటి శుక్రవారం, పూర్ణిమ రోజున మరియూ అన్ని పెద్ద పండగల రోజున కూడా ప్రీతీ భోజ్ పేరుతో ప్రసాద వితరణ చేస్తున్నారు..
-శ్రీమతి తుగ్గుడం అనూరాధ (కాలిఫోర్నియా)
శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం – మిల్పిటాస్, కాలిఫోర్నియా
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరం (మేల్పీఠ నగరం)లో ఉన్న దేవాలయాల్లో ప్రధానమైనది – భవ్యమైన ‘వేద’ సత్యనారాయణ స్వామి బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారిచే స్థాపింపబడి, 15 ఏళ్లుగా ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం దక్షిణ బేఏరియాలోని ప్రధాన ఆలయాలలో ఒకటి. తెలుగువారున్న ఆలయ మైనా, అన్ని భాషలూ మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ భక్తిని వెల్లడిరచుకోవడం ఇంకొక విశేషం. ఆలయంలో ప్రధానమూర్తి రమాసహిత శ్రీ సత్యనారాయణస్వామి. ఒక పక్క శివాలయం, విఘ్నేశ్వరుడు, దుర్గా మాత ఉన్నారు. ఇంకొక పక్క వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి, క్షేత్రపాలకుడు ఆంజనేయుడు, సరస్వతీ దేవి, దక్షిణామూర్తి ఉన్నారు. ఇంకొకపక్క శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి, శ్రీఆదిశంకరులు, రామానుజా చార్యులు, దారు మేరువు, దత్తాత్రేయుడు ఉన్నారు. ఆలయం వెలుపల, నవగ్రహవేదిక నాగదేవతామండపం, శనైశ్చర విగ్రహం, ధ్వజ స్తంభం ఉన్నాయి. ఇవేకాక వివిధ ఉత్సవ మూర్తులు, కళ్యాణ మంటపాలు ఉంటాయి.
సమగ్ర ఆలయ ఆగమ వాస్తుతో నిర్మించిన ఈ దేవాలయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం శ్రీ మారేపల్లి వేంకట శాస్త్రి గారిచే నిర్దేశింపబడిన ఇక్కడి పదకొండు మంది అర్చక బృందం, సరిjైున చక్కటి సలహాదారుల సహ కారం, స్త్రీల సువాసినుల పుష్పమాలికా బృందం ఎప్పటికప్పుడు, ప్రతి దినము అలంకరణలకీ, ప్రత్యేక పండగ పూజలకీ కూడా సుందరమైన మాలలు తయారు చేసి సమర్పించడం ఇక్కడ బహు విశేషం. ఈ మధ్యనే జరిగిన ధ్వజస్తంభ స్థాపనతో ఈ ఆలయం క్షేత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
ఉగాది నాడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఉగాది పచ్చడితో సహా మహాప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి పౌర్ణమినాడు, ప్రత్యేకమైన రోజుల్లోనూ, సామూహిక సత్యనారా యణ స్వామి వ్రతాలు ఎంతో ఘనంగా జరుగు తాయి. ఇక్కడ దేవీ నవరాత్రులలో ప్రతిరోజూ ఒక విశేషమైన అమ్మవారి విగ్రహం తయారు చేసి పూజలు చేస్తారు. గణేశ నవరాత్రులూ పెద్ద ఎత్తున చేస్తారు. అన్నిటికన్నా గొప్ప విషయం పూర్వాపరములు కార్యక్రమాలు అన్నీ జరిపిం చడం. లెక్కలేనన్ని శ్రాద్ధ కర్మలు శ్రద్ధతో చేస్తూ వుంటారు ఏడాది పొడుగూనా జరుగుతాయి.
ఇక్కడ జరిగే కార్యక్రమాలలో అతి ప్రధానమైనది వేద విద్యా ప్రదానం. ప్రధాన ఆచార్యులు బ్రహ్మశ్రీ మారేపల్లి వేంకట శాస్త్రి గారు ఉచితంగా చాలామంది శిష్యులకి 18 ఏళ్లుగా యజుర్వేద విద్యని బోధిస్తున్నారు. శ్రద్ధాళువుల కోసం పూజా విధానం, భగవద్గీతా పఠనం, జ్యోతిశ్శాస్త్ర అధ్యయనం, విష్ణు సహస్రనామ భాష్యం, రామాయణ కావ్య బోధన వంటి కార్యక్రమాలు ఉంటాయి. బే ఏరియాలోనూ, తదితర ప్రదేశాలలో కూడా ఇక్కడి అర్చకులు పెళ్లిళ్లు, ఉపనయనాలు, బారసాలలు.. ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సంస్కృతాంధ్రభాషలలో 25 అష్టావధానములు చేసిన మహా కవి శ్రీ, పాలడుగు శ్రీచరణ్ గారు అనేక శాస్త్రసంబంధిత సందేహములను తీరుస్తూ ఉంటారు. పవసఱష జుసబషa్‌ఱశీఅ డ ణవఙశ్ీఱశీఅaశ్రీ Aషaసవఎవ – పజుణA అని పిలవబడే ఈ సంస్థానంలో ఒక మంచి గ్రంథాలయం, ప్రసాద వితరణవసతి, మంచి వంటశాల ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటినీ పర్యవేక్షించ డానికి, భక్తులందరికీ అన్ని ఏర్పాట్లూ విజయవంతంగా చెయ్యడానికి, ఆలయ యాజమాన్యం దువ్వూరు దయాకర్ గారి అధ్యక్షతన పెద్ద సహాయక బృందంతో శాయశక్తులా కృషి చేస్తున్నారు.
– కృష్ణకుమార్ పిల్లలమర్రి,
మాలిబు హిందూ టెంపుల్ – లాస్ ఏంజెల్స్
లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా పర్వతాలలోని మాలిబు సమీపంలోని కలబాసస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మాలిబు హిందూ దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక వేదికగా విలసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైవున్న ఈ దేవాలయం 1981లో నిర్మించబడిరది. సదరన్ కాలిఫోర్నియాలోని హిందూ టెంపుల్ సొసైటీ యాజమాన్యంలో ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత శైలిలో నిర్మించిన ఈ దేవాలయాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న సివిల్ ఇంజనీరైన వాసన్ శ్రీనివాసన్ ఈ దేవాలయానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడి స్థానిక కుటుంబాల నుండి నిధులు సేకరించడం, నిర్మాణ పర్యవేక్షణ, భారతదేశం నుండి పూజారులను తీసుకురావడంలో శ్రీనివాసన్ కీలకపాత్ర పోషించారు. ఈ దేవాలయంలోవున్న రెండు సముదాయాలలో ఎగువ కాంప్లెక్స్‌లో వేంకటేశ్వరస్వామి, దిగువ కాంప్లెక్స్ లో శివుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఇతర దేవతల మందిరాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయంలో వివిధరకాల కార్యక్రమాలతోపాటు పండుగలు, ఇతర పర్వదినాల్లో విశేష సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యనారాయణ పూజ, కళ్యాణోత్సవం, అభిషేకం ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇతర వివరాలకు వెబ్సైట్ చూడండి.
శ్రీ అష్టలక్ష్మీసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ – లాస్ ఏంజెల్స్
కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్‌లో శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయంలో అష్టలక్ష్ములు కొలువై భక్తులకు కనువిందు చేస్తారు. ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, సంతాన లక్ష్మీ, విజయలక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, వీరలక్ష్మీ, విద్యాలక్ష్మీ ఇక్కడి ప్రధాన ఆలయంలో కనిపిస్తారు. అలాగే శ్రీ మహాలక్ష్మీతోపాటు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ నరసింహ స్వామి కూడా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. శివుడు, హనుమంతుడు, సాయిబాబా తదితర దేవతామూర్తులను కూడా చూడవచ్చు. ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతాయి. మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామి, నరసింహ, శివ, వాసవిదేవిలకు ప్రతి రోజు నిత్యార్చన జరుగుతాయి. ఉదయం 9.30కు ఈ అర్చన కార్యక్రమం ఉంటుంది. రుద్రాభిషేకం ప్రతిసోమవారం, హనుమాన్ ఛాలీసా పారాయణం ప్రతి మంగళవారం, సాయిబాబా భజనలు ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీకి సహస్రనామార్చన చేస్తారు. ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. దీంతోపాటు మాతా కరుణామయి సత్సంగ్, భజనలు, సంపుటీక శ్రీసూక్త పారాయణం, మెడిటేషన్ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. శ్రీ సత్యనారాయణ వ్రతం, గణపతి హోమం వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చూడవచ్చు.
దేవాలయాన్ని సాధారణ రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి 11.30 వరకు, సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. శనివారం, ఆదివారం దినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 6 నుంచి 8.30 వరకు తెరిచి ఉంచుతారు. మహామంగళహారతి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఇతర వివరాలకు దేవాలయం వెబ్‌సైట్‌ను చూడండి.
ది హిందూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అమెరికా
ది హిందూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అమెరికా (నజుజూA) ఆధ్వర్యంలో పోర్ట్లాండ్ బాలాజీ దేవాలయం భక్తుల ఆదరణతో వివిధ కార్యక్రమాలను విజయవం తంగా నిర్వహిస్తోంది. సుందరరాజన్ రాజగోపాల్ కొద్దిమంది భక్తులతో దీనిని ఏర్పాటు చేశారు. ఇది మొదట న్యూజెర్సీ (హిందూ ఎడ్యుకేషన్ సొసైటీ)లో నమోదు చేసిన సంస్థ. తరువాత లాభాపేక్ష రహిత సంస్థగా ఒరెగాన్‌లో నమోదు చేశారు. న్యూజెర్సి నుంచి ఒరెగాన్ వచ్చిన తరువాత రాజగోపాల్ ఈ ప్రాంతంలోని భక్తులతో కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. పోర్ట్ ల్యాండ్, వాంకోవర్, కొర్వల్లిస్, సేలం మరియు యూజీన్లోని భక్తుల సహాయంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతోంది. ఏప్రిల్ 2010న ఒరెగాన్ లోని హిల్స్‌బోరోలో ఈ సంస్థ ప్రారంభమైంది. తొలుత కలియుగ ప్రత్యక్షదైవం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠిం చారు. తరువాత ఆలయంలో ఎన్నో కార్యక్రమా లను పండుగలు, నిధుల సేకరణ కార్యక్రమా లను విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ పండితులు ఈ ఆలయంలో పని చేస్తు న్నారు. ఉపాకర్మ (ఋగ్/యజుర్/సామ), జన్మాష్టమి, పదకొండు రోజుల పాటు వినాయక చతుర్థి, దసరా, దీపావళి, కార్తీక సోమవారం శివాభిషే కాలు వంటి కార్యక్రమాలను ఆలయంలో నిర్వహి స్తున్నారు. ఇదే ఆలయంలో ఇతర దేవతా ప్రతిమలను కూడా ప్రతిష్ఠించారు. భారతీయ సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడంలో భాగంగా, ఆలయంలో అనేక సాంస్కృతిక కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం, శ్రీ త్యాగరాజ ఉత్సవం, కర్ణాటక సంగీత కచేరీలు వంటి కార్యక్రమాలు వైభవంగా జరిపారు.
– కర్ణాటక సంగీతం, ప్రాంతీయ తరగతులను అందించడానికి శ్రీ బాలాజీ విద్యాలయ తరగతుల విస్తరణ
– హిందూ సాంస్కృతిక విలువలను తెలుసుకునేలా వివిధ భాషల్లో బోధనా తరగతులు, యోగా వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
– ఈ ఆలయాన్ని మరింత విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి వీలుగా ఇప్పటికే స్థలాన్ని సేకరించి దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలనుకుంటే ఆలయ వెబ్‌సైట్‌ను దర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.
వేద శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ – సియాటెల్
హిందూ సమాజ అవసరాలను తీర్చడానికి మరియు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు, ఆచారాలను జరుపుకోవడానికి వీలుగా రెడ్మండ్ ప్రాంతంలో వేద శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్‌ను ఏర్పాటు చేశారు. తొలుత ఆలయానికి ముందు వేద పేరుతో ఓ సంస్థను ఆగస్టు 2007లో స్థాపించారు, సంస్థ ఏర్పాటు తరువాత వచ్చిన ఉత్సాహభరితమైన మద్దతుతో వేద శ్రీ వేంకటేశ్వర ఆలయంను అక్టోబర్ 2009లో ప్రారంభించారు.
ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంగణంలో శివుడు, దేవి దుర్గ మరియు 12 ఇతర దేవతలతో పాటుగా వేంకటేశ్వరుడు ప్రధాన దేవతగా కొలువై కనిపిస్తారు. ఆలయంలో స్వామివార్లకు రోజువారీ సేవలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలను వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు, లక్ష్మీ పూజ, గణపతి పూజ, శ్రీనివాస కళ్యాణం, రుద్రాభిషేకం, ఉపాకర్మ వంటి సామూహిక పూజలను ఉచితంగా నిర్వహి స్తున్నారు. సాధారణ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమా లతో పాటు, సుధా రఘునాథన్, సుఖీశివం, డా.ఎల్. సుబ్రమణ్యం, డా.ఎస్.పి. బాల సుబ్రహ్మ ణ్యం, మల్లాది బ్రదర్స్, శ్రీ ఉన్ని కృష్ణన్, క్రేజీ మోహన్ మొదలైన ప్రపంచ ప్రఖ్యాత కళాకారులతో శాస్త్రీయ సంగీతం మరియు నృత్య కచేరీలను కూడా ఈ సంస్థ నిర్వహించింది.
మన వారసత్వాన్ని సంప్రదాయాన్ని కొనసాగించడంలో, మన తర్వాతి తరానికి వాటిని అందించడంలో భాగంగా, భారతీయ శాస్త్రీయ నృత్యం మరియు కర్నాటిక్/హిందూస్థానీ సంగీత తరగతులు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వేద చురుకుగా ప్రోత్సహిస్తోంది. భాషా తరగతులు, యోగాసెషన్లు కూడా ఏర్పాటు చేశారు. వేద సంస్థను 501(సి)(3) ధృవీకరించ బడిన లాభాపేక్ష లేని సంస్థగా గుర్తించడం వల్ల ఈ సంస్థకు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయిం పులు లభిస్తాయి. భక్తులంతా మరింతగా సహక రిస్తే గ్రేటర్ సియాటెల్‌లో ఒక గొప్ప హిందూ దేవాలయాన్ని మరింతగా విస్తరించడం తోపాటు మరిన్ని కార్యక్రమాలు, ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి వీలవుతుందని పాలకమండలి పేర్కొంటోంది. త్వరలో పూర్తి స్థాయి గుడిని నిర్మించటానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని, దాతలు భూమి లాగా స్టోన్‌ని విరాళం ఇచ్చే సౌకర్యం ఉందని, ముందుకు రావలిసిందని పాలక మండలి కోరింది.
ఆగమ వాస్తు శాస్త్రాలను అనుసరించి భక్తులకోసం కొలరాడోలోని కాజిల్ రాక్‌లో రాతి పర్వతాల బ్యాక్ డ్రాప్‌తో శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) ఆలయాన్ని నిర్మించారు. సౌత్ రిడ్జ్రోడ్డుల ఉన్న ఈ దేవాలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేద సంప్రదాయాల ప్రకారం హిందూ మతపరమైన సేవలతోపాటు, శాస్త్రీయ సంగీతం, నృత్యం, కళ, గ్రంథాలు మెడిటేషన్ వంటి వాటిని ప్రోత్సహించడం, నిర్వహించడం ద్వారా భక్తుల కోరికలను నెరవేర్చేందుకు ఆలయ పాలకవర్గం కృషి చేస్తోంది. ఆలయంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానమైన మూలమూర్తిగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ, ఆండాళ్ అమ్మవార్లు, శివ, గణపతి, హనుమాన్, షిర్డి బాబా వంటి దేవతా మూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. అభిషేకం, నిత్య అర్చన, కళ్యాణోత్సవం వంటి కార్యక్రమాలను ఆలయంలో నిర్వహిస్తున్నారు. అలాగే భక్తుల కోరిక మేరకు సత్యనారాయణ వ్రతం, వాస్తుహోమం, గణపతి హోమం, సుదర్శన హోమం ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఉగాది, దీపావళి వంటి వేడుకల్లో కూడా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ – డల్లాస్
డల్లాస్‌లో పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో, భక్తులకోసం శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. 2007లో తొలుత ఆలయ నిర్మాణంకోసం స్థలాన్ని కొనుగోలు చేయాల్సిందిగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డల్లాస్ ప్రాంత భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరారు. ఆయన ఆసీస్సులతో 2007 చివరలో, మెట్రోప్లెక్స్ విస్తృత శోధన తర్వాత, టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఒక 10 ఎకరాల భూమిని గుర్తించి ఇక్కడ ఆలయ నిర్మాణం బావుంటుందని చర్చించుకుని నిర్ణయించారు. దానికితోడు ఇక్కడ ఉన్న ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమవుతుందని అప్పుట్లో అనుకోలేదు. స్వామీజీ ఆశీస్సులతో స్థలాన్ని కొనుగోలు చేయడం, తరువాత తాత్కాలికంగా ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జైపూర్‌కు చెందిన పింక్ హనుమాన్ విగ్రహం ఫ్రిస్కోకు వచ్చింది. 2009లో హనుమాన్ కల్చరల్ సెంటర్‌గా పేరు పొందిన ఈ 10,000 చదరపు అడుగుల భవనాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజి ప్రారంభించారు. హనుమాన్ కల్చరల్ సెంటర్ త్వరలోనే ఓ దేవాలయంగా, అన్నదాన మందిరంగా, దత్త తరగతులు, సంగీత కేంద్రంగా పేరు తెచ్చుకుంది.
2013లో 33000 చదరపు అడుగుల కార్యసిద్ధి హనుమాన్ ఆలయానికి పూజ్య స్వామీజీ శంకుస్థాపన చేశారు. స్థానిక సాధారణ కాంట్రాక్టర్, ఎయుఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయగా, భారతదేశానికి చెందిన సుబ్రహ్మణ్య స్థపతి ఆధ్వర్యంలోని సుమారు 30 మంది శిల్పుల బృందం లోపల గర్భగుడిని, అలాగే వెలుపలి భాగంలో 3 గోపురాలను సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పూర్తి చేసింది. ప్రధాన హనుమాన్ గర్భ గుడి గ్రానైట్‌తో చేయబడిరది. గ్రానైట్‌ను భారతదేశం నుంచి తెప్పించారు. గ్రానైట్ గర్భగుడిని పొరల వారీగా అమర్చడానికి గ్రానైట్‌లో నైపుణ్యం కలిగిన నలుగురు భారతీయ కళాకారులను తీసుకువచ్చారు. భవనం, పార్కింగ్ మరియు ల్యాండ్‌స్కేపింగ్‌తో సహా నిర్మాణం పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది.
కార్యసిద్ధి హనుమాన్ ఆలయ రాజగోపురాన్ని పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జూలై 20, 2019న ప్రారంభించారు. రాజగోపుర కలశ స్థాపన జూన్ 24 నుండి 26, 2019 మధ్య జరిగింది.ఇందులో కలశ యంత్రాల స్థాపన మరియు వివిధ పూజలు మరియు హోమాలు నిర్వహించారు.
నేడు కార్యసిద్ధి హనుమాన్ ఆలయం వివిధ ఆధ్యాత్మిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా మారింది.
అస్టిన్ హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ – అస్టిన్
అస్టిన్లోని హిందూ భక్తుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా ఏర్పాటైన సంస్థ ఆస్టిన్ హిందూ దేవాలయం, కమ్యూనిటీ సెంటర్ ఇది లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా హిందూమతం గొప్పతానికి ప్రతీకగా ఉన్న దేవాలయ ఆచార వ్యవహారాలను తెలియజేస్తోంది. విద్య ద్వారా హిందూ మతం యొక్క ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది మరియు ఆచరిస్తుంది. హిందూ గ్రంధాలలో నొక్కిచెప్పబడిన విలువలను సమీకరించడం ద్వారా మరియు వాటిని మన దైనందిన జీవితంలో వర్తింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక సంపద మరియు మానవ శ్రేష్ఠత కోసం దేవాలయం కృషి చేస్తుంది, అర్హత కలిగిన పూజారులతో ఆలయంలో సాంప్రదాయం ప్రకారం పూజా సేవలను నిర్వహిస్తున్నారు. ఆస్టిన్ మెట్రోపాలిటన్ ప్రాంతం, పరిసరాల నుండి వస్తున్న భక్తుల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను ఈ అస్టిన్ హిందూ దేవాలయం ఏర్పాటు చేస్తోంది. ఆలయాన్ని ఉదయం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం నుంచి 9వరకు తెరచి ఉంచుతారు. శనివారం రోజు ఉదయం 10 నుంచి 2 వరకు, ఆదివారం 5 నుంచి 9వరకు తెరచి ఉంచుతారు.
హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో
గ్రేటర్ చికాగోలో వేలాది హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. 1977లో అప్పటి గ్రేటర్ చికాగో తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీ తిరుపతయ్య తెల్లా, శ్రీ గల్లా నాయుడు, శ్రీ ఉమాపతి ఆర్. కట్టమంచి, శ్రీ బి. చంద్రశేఖర్ రెడ్డిలతో సహా చిన్నపాటి ఔత్సాహికులు సమావేశమై దేవాలయం ఏర్పాటుపై చర్చించారు. మతపరమైన సంస్థను స్థాపించడం మరియు ఆలయాన్ని నిర్మించడం. శ్రీ సి. నటరాజన్, స్వర్గీయ శ్రీ బి. శేషాద్రి, శ్రీ పి. కృష్ణన్, శ్రీ ఎం. పట్టాభిరామన్, శ్రీ సురేంద్ర గోయెల్, మరియు దివంగత శ్రీ అరుణ్ మన్సుఖాని తదితరులు ఈ దేవాలయం ఏర్పాటుకు పనిచేసిన ఇతర మార్గదర్శకులు. ఓక్ పార్క్‌లోని శ్రీ శేషాద్రి నివాసంలో వారానికోసారి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ‘‘ది హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో’’ను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని సంస్థగా మార్చారు. మొదటి జనరల్ బాడీ సమావేశం డిసెంబర్ 1977లో జరిగింది మరియు 1978కి మొదటి పాలకమండలిని అధికారికంగా ఎన్నుకున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హిందువులందరి మతపరమైన అవసరాలను తీర్చడానికి, సీతాదేవి, శ్రీ లక్ష్మణ, హనుమంతుడు మరియు వినాయకుడితో పాటు ప్రధాన దేవత (ప్రధాన దేవుడు) శ్రీరామునిగా ఉండాలని నిర్ణయించారు. సాంప్రదాయ ఆలయాన్ని నిర్మించడానికి తగిన స్థలాన్ని చూశారు. డిసెంబర్ 1981లో మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడం ఒక స్మారక పని, మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ స్థపతి గణపతి ప్రధాన భారతీయ వాస్తుశిల్పిగా నియమితులయ్యారు. జూన్ 17, 1984న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ రామారావు మూడు రోజుల యజ్ఞ కార్యక్రమం తర్వాత ఆలయానికి శంకుస్థాపన చేశారు. జూన్ 11, 1985న అధికారికంగా గణేష్ మందిరాన్ని ప్రారంభించారు. తరువాత అంచెలంచెలుగా ఆలయాన్ని విస్తరించారు. నేడు ఆలయం సకల మూర్తులతో అందంగా కొలువై ఆకర్షిస్తోంది. ఆలయం వివిధ రకాల ఉత్సవాలు, వివిధ కార్యక్రమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
శ్రీవేంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్
డిట్రాయిట్‌లోని నోవిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఈ ప్రాంతంలోని భక్తులకు ఆరాధ్య స్థలంగా పేరు పొందింది. ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. 2000లో ఈ ఆలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేశారు. 2009లో ఆలయ నిర్మాణ భూమిపూజ జరిగింది. డిసెంబర్ 11`13న బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. తరువాత ఆలయం నిర్మాణం ఊపందుకుని నేడు కనువిందు చేస్తోంది. ఈ ఆలయంలో మూలమూర్తిగా శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామివారు ఇతర దేవతామూర్తులు కొలువై ఉన్నారు. దేవాలయంలో పర్వదినాల్లో విశేష సేవా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు. శ్రీనివాస కళ్యాణం వంటి వివిధ కార్యక్రమాలను వైభవంగా జరుపుతారు.
శ్రీ శివ విష్ణు ఆలయం – వాషింగ్టన్‌డీసి
మేరీల్యాండ్‌లోని లాన్హామ్లో ఉన్న శ్రీ శివ విష్ణు ఆలయం, వాషింగ్టన్ డిసి నుండి 12 మైళ్ల దూరంలో ఉంది, 1970 చివరలో కొంతమంది భక్తుల నివాస గదులలో, ఇప్పుడు అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా శ్రీ శివ విష్ణు ఆలయం రూపొందింది. ఆలయ నిర్మాణం 1988లో ప్రారంభమైంది. మాయన్, పల్లవ, విజయనగర, కేరళ మరియు సౌత్ కెనరా ఆలయ నిర్మాణ శైలితో ఈ ఆలయం కనువిందు చేస్తుంది. 1990 మరియు 2002 సంవత్సరాల మధ్య ప్రతిష్ఠించిన అనేక దేవతలతో కూడిన అనేక సన్నిధులు ఉన్నాయి.
శ్రీ శివ విష్ణు దేవాలయం హిందువులను ఏకతాటిపైకి తీసుకురావాలనే భావనతో ప్రారంబ óమైంది. హిందూ ఆచారాలు మరియు వారసత్వాన్ని ఒకచోట చేర్చే ప్రదేశంగా మారింది. అమెరికాలోని హిందూ సమాజానికి చిహ్నంగా మారింది. 1997లో, యువత మరియు విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి మరియు వాషింగ్టన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న హిందూ జనాభా అవసరాలను తీర్చడానికి నిధిని ప్రారంభించడంతోపాటు, 1998లో ఈ ఆలయం ద్వారా కమ్యూనిటీ సేవ మరియు స్వచ్ఛంద సేవను విస్తృతంగా చేయడం ప్రారంభమైంది.
ఆలయంలో శివుడు, అనంతపద్మనాభస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, శ్రీ చండికేశ్వర, హనుమాన్, శ్రీరామ, శ్రీ ఆండాళ్, నవగ్రహాలు ఇతర దేవతలు కొలువై పూజలందుకుంటున్నారు.
శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ – వర్జీనియా
శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ ఆఫ్ వర్జీనియా 2003 సంవత్సరంలో నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆలయం నిర్మాణంకోసం 2003 మరియు 2005లో బ్రాడ్డాక్ రోడ్, ఫెయిర్‌ఫాక్స్, వర్జీనియాలో సుమారు 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కూడా అందరినీ ఆకట్టుకునేలా తామరపువ్వు రూపంలో నిర్మించారు. తామర పువ్వు యొక్క ప్రాముఖ్యత ప్రశాంతత, గొప్పతనం మరియు సంపదను సూచిస్తున్నట్లుగానే ఈ ఆలయంలో ప్రవేశించినప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని నిర్మించి ఘనంగా ప్రారంభించారు. ఆలయంలో మూలవిరాట్‌గా శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. శ్రీరామ పరివారం, శ్రీ మహాలక్ష్మి తాయార్, శ్రీ ఆండాళ్, శ్రీ కృష్ణ, శ్రీ సుదర్శన మరియు ఆళ్వారులు విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
ఇక్కడ ఉన్న పిల్లలకు మన భారతీయ సంస్కృతిపై అవగాహన పెంపొందించడంతో పాటు వారికి అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వం మన సంప్రదాయాల గొప్పతనం గురించి వారిలో అవగాహన కల్పించడంకోసం ఆలయ కార్యక్రమాలు ప్రత్యేకంగా పిల్లల భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మి టెంపుల్ – బోస్టన్
యాష్లాండ్లోని శ్రీలక్ష్మి దేవాలయం వివిధ రకమైన కార్యక్రమాలతో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయం ఏర్పాటు వెనుక సంవత్సరాల చరిత్ర ఉంది. 1978లో న్యూ ఇంగ్లండ్‌లోని హిందూ దేవాలయం నిర్మించాలన్న ఆలోచన కొద్ది మంది వ్యక్తుల మనస్సులలో కనిపించింది. తరువాత అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆగష్టు 12, 1978న జరిగిన సమావేశంలో, మహాలక్ష్మి కృపతో ప్రసాదించిన శ్రేయస్సు మరియు ఆనందాన్ని వెతుక్కుంటూ మనలో చాలా మంది ఈ దేశానికి వచ్చినందున, ఈ ఆలయాన్ని శ్రీ లక్ష్మీదేవికి ప్రధాన దేవతగా అంకితం చేసి నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. న్యూ ఇంగ్లాండ్ హిందూ దేవాలయం, ఇంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం అక్టోబర్ 28, 1978న మసాచుసెట్స్‌లోని మెల్రోస్లోని నైట్స్ ఆఫ్ కొలంబస్ హాల్లో మహాలక్ష్మి పూజ మరియు దీపావళి వేడుకలతో నిర్వహించారు. 1981 వేసవిలో మసాచుసెట్స్‌లోని ఆష్‌ల్యాండ్ పట్టణంలో దాదాపు పన్నెండు ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం సేకరించారు. తమిళనాడు శిల్పి శ్రీ గణపతి స్థపతిని ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయాన్ని రూపొందించి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆయన ఇచ్చిన ప్రతిపాదనలతో పర్మిషన్ తీసుకుని ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. సెప్టెంబరు 6, 1986న అంగరంగ వైభవంగా ప్రారంభపూజ జరిగింది.
అన్ని ప్రధాన హిందూ పండుగలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడంతో అప్పటి నుండి వారాంతంలో ఆలయం తెరిచి ఉంచడం ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతం మరియు నృత్య కచేరీలు, త్యాగరాజ ఆరాధన, దీక్షితార్ దినోత్సవం, సూరదాస్, మీరా భజనలు మరియు ఉపన్యాసాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయాన్ని హిందూ సమాజానికి కేంద్ర బిందువుగా మార్చాయి. మహామండపం నుండి మరో ముప్పై అడుగుల వరకు విస్తరించి, ప్రధాన దేవతలైన గణేష్, మహాలక్ష్మి మరియు వేంకటేశ్వరుల కోసం గర్భాలయాలను సెప్టెంబర్ 1987లో నిర్మించారు. ఇలా అంచెలంచెలుగా నిర్మితమైన ఆలయం నేడు ఎంతోమందిని ఆకర్షిస్తోంది.
శ్రీ వేంకటేశ్వర దేవాలయం, కమ్యూనిటీ సెంటర్ – న్యూజెర్సి
ఉత్తర అమెరికాలోని అత్యంత అందమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా న్యూజెర్సిలోని బ్రిడ్జ్‌వాటర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర దేవాలయం మరియు కమ్యూనిటీ సెంటర్ పేరు తెచ్చుకుంది. 1998లో ఈ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆగమశాస్త్ర సాంప్రదాయం ప్రకారం ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూలవిరాట్‌గా శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమతుడై భక్తులకు కనువిందు చేస్తారు. ఇతర దేవతా మూర్తులను కూడా ఆలయంలో ప్రతిష్ఠించారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి, మహాగణపతి, శివపార్వతులు, అయ్యప్ప స్వామి, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి తదితర దేవతామూర్తులు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. కళ్యాణ మండపం, కల్చరల్ సెంటర్, ఆడిటోరియంలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయాన్ని సాధారణ రోజుల్లో ఉదయం 8.30 నుంచి 12.30 వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు తెరచి ఉంచుతారు. సెలవురోజుల్లో, వీకెండ్ శని,ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరచి ఉంచుతారు. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దీపావళి, ఉగాది వంటి విశిష్టమైన రోజుల్లో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తుంటారు.
శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ (కృష్ణమందిర్) – న్యూజెర్సి
న్యూజెర్సిలోని మోర్గాన్విల్లెలో ఉన్న శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచి ఆధ్యాత్మిక పరిమళాలను వికసింపజేస్తోంది. హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్‌ను 1988లో ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో శ్రీ గురువాయూరప్పన్ ప్రధాన దేవతగా కొలువై కనిపిస్తారు. శ్రీ శివుడు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ అయ్యప్ప, శ్రీ సత్యనారాయణ స్వామితో సహా ఇతర దేవతామూర్తులు కూడా ఇక్కడ కొలువై భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయంలో ఎన్నో సేవలను అందిస్తున్నారు. సుప్రభాతం, ప్రాతకాలపూజలు, గణపతి హోమం, సుదర్శన హోమం, అభిషేకం, మహామంగళహారతి వంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం జరుగుతాయి. విశేష పర్యదినాల్లో సంకటహర చతుర్థిరోజు, ప్రదోషం రోజు, మాస శివరాత్రి, శుక్లషష్ఠి, కృత్తిక, మాససంక్రమణం, శుక్లపక్ష ఏకాదశి పూర్ణిమ, పునర్వసు ఇతర ముఖ్యమైన రోజుల్లో విశేష కార్యక్రమాలను ఆలయంలో నిర్వహిస్తారు. ఇదే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వేదికగా న్యూజెర్సిలోని శ్రీ గురువాయూరప్పన్ సన్నిధి నిలుస్తోంది. భజనలు, శ్లోకాలు, డ్యాన్స్, డ్రామాలు, చిన్నారుల నాటిక ప్రదర్శనలు, కర్ణాటక సంగీత కచేరీలు, హరికథ, భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఆట్టం వంటి ఎన్నో కళా నృత్యనాటిక ప్రదర్శనలను ఈ ఆలయ వేదికగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ప్రముఖులతో ప్రవచన కార్యక్రమాలను కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గోశాలను కూడా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్లాసులకోసం సరస్వతీ విద్యాలయను ఏర్పాటు చేశారు.
సాయిదత్త పీఠం – న్యూజెర్సి
భారతీయ ఆధ్యాత్మిక జ్యోతి అమెరికాలో ప్రజ్వరిల్లేలా చేసేందుకు.. అకుంఠిత కార్యదీక్షతో ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి ఏర్పాటు చేసిన వేదిక సాయిదత్త పీఠం..
2014లో మహా శివరాత్రి నాడు న్యూజెర్సీ ఎడిసన్ లో సాయి దత్త పీఠం ఉద్భవించింది. శ్రీ రఘు శర్మ శంకరమంచి ఆధ్యాత్మిక ఆలోచనల నుంచి పుట్టిన ఈ సాయిదత్త పీఠానికి ఆ శివుడు, సాయి నాధుడి ఆశీర్వాదాలు సంపూర్ణంగా లభించడంతో అనతి కాలంలోనే సాయి దత్తపీఠం దేదీప్యమైన జ్యోతిలా అమెరికాలో ప్రకాశించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో ఏర్పాటైన ఈ సాయి దత్తపీఠం.. నేడు ఎడిసన్ నడిబొడ్డున శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత చేరువైంది.
2021 జాన్, జూలై మాసాలలో శ్రీ సాయి దత్త పీఠం అర్ధ్వర్యంలో నిర్మితమైన శ్రీ శివ విష్ణు ఆలయంలో శ్రీ హేరంబ గణపతి, శ్రీ పంచముఖ పరమ శివ, శ్రీ కామాక్షీ అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మురుగన్, శ్రీ హనుమాన్, శ్రీ అయ్యప్పస్వామి, నవగ్రహ దేవత సహిత ఉత్సవ దేవతా మూర్తులు, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ, శ్రీ షిరిడీ సాయిబాబా మరియు, దత్త పరంపర సన్నిధి సహితంగా సమస్త దేవతా సమాహారంగా పూజలందుకొంటోంది.
భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ సాయిదత్త పీఠం చేపట్టిన కార్యక్రమాలకు భక్త జనం నీరాజనం పడుతున్నారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సౌఖ్యం ఉంటుంది. సౌభాగ్యం ఉంటుంది. అందుకే సాయి చెప్పిన శాంతి మార్గంలో నడుస్తున్న సాయి దత్త పీఠం…2014లో ప్రపంచ శాంతి కోసం లలిత మహా యజ్ఞం నిర్వహించింది. అశేష భక్త జనం ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నారు.. వసుదైక కుటుంబంగా శ్రీ లలితా దేవిని ఆరాధించారు.
శ్రీ సాయి బాబా చెప్పిన సాయి మార్గమంటే, కేవలం యజ్ఞయాగాదులు మాత్రమే కాదు.. అన్నదానం, విద్య, సేవ, సత్సంగం. ఈ నాలుగింటిని సాయి దత్త పీఠం సదా ఆచరిస్తూ వస్తోంది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడంలోనే దైవత్వం ఉందనేది చాటుతూ అనేక కార్యక్రమాలు చేపట్టింది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కంటే దైవత్వం మరొకటి లేదన్న సాయి మాటలను నిజం చేస్తూ సాయి దత్తపీఠం, నేపాల్ భూకంప బాధితులకు సాయం చేసింది. విశాఖ హుద్ హుద్ తుఫాను బాధితులకు తన వంతు చేయూతనిచ్చింది. విద్యతోనే వికాసం.. అని భావించే సాయి దత్త పీఠం పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇస్తూ పరోపకారంపై చెప్పిన సాయి సందేశాన్ని ఆచరించి చూపింది. గురుకులం ద్వారా విద్యార్ధులను సత్సంగం.. సద్గురువుల సత్సంగం మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది. అందుకే సాయి దత్త పీఠం సద్గురువులను పీఠానికి ఆహ్వానిస్తుంది. వారి సందేశానికి భక్త జనానికి చేరువ చేస్తోంది. శ్రీ శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ, పరిపూర్ణానంద, చిన జీయర్, శ్రీ కరుణామయి మాత.. ఇలా ఎందరో ఆధ్యాత్మిక ప్రవక్తలు, దైవ సమానులు ఈ సాయి దత్త పీఠానికి విచ్చేసి తమ విలువైన సందేశాలను భక్తులకు అందించారు.
సౌత్ ప్లైన్ఫీల్లో ఉండే సాయి దత్త పీఠాన్ని భక్తుల సౌకర్యార్థం విస్తరించే క్రమంలో 2019 మొదలు పెట్టిన కార్యక్రమం ఎడిసన్ నడిబొడ్డు కు రావటానికి ఎన్నో వ్యయ ప్రయాసలను తట్టుకుని రెట్టింపు స్థలంలో సకల దేవతల సమాహారంగా శ్రీ శివ విష్ణు మందిర ప్రాంగణంగా మీ ముందుకు వచ్చింది. అన్నప్రసాదాలయ, ఫంక్షన్ హాల్ ల ఏర్పాటు ఇక్కడి ప్రతేక్యత. జన్మదిన, వివాహాది శుభకార్యక్రమాలకు అందరికీ అందుబాటులో ఉండేలా యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది.
వివరాలకు 732-809-1200లో కానీ, 516-359-8178లో కానీ సంప్రదించవచ్చు.
శ్రీ మహావల్లభ గణపతి దేవాలయం – ఫ్లషింగ్, న్యూయార్క్
నార్త్ అమెరికా హిందూ టెంపుల్ సొసైటి ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మించాలన్న ఆలోచనకు జనవరి 26,1970న కార్యరూపం ఇవ్వడం జరిగింది. రష్యన్ ఆర్టడాక్స్ చర్చ్‌కు చెందిన స్థలాన్ని సొసైటీ తీసుకోవడం జరిగింది. తొలుత ఆ స్థలంలో చిన్నపాటి ఫ్రేమ్ హౌజ్‌ను నిర్మించారు. ఆ స్థలంలోనే పూజాకార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 1977లో ఇప్పుడు ఉన్న దేవాలయం నిర్మాణం పూర్తయింది. ఆగమ శాస్త్రానుసారం ఈ దేవాలయాన్ని నిర్మించారు. అదే సంవత్సరం జూల్కెలో తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పడ్రిమల్కె స్వామిగళ్ ఆధ్వర్యంలో 26 యంత్రాలను తయారు చేయించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానమూర్తిని ఆరోజే ప్రతిష్ఠింపజేయడంతో పాటు తొలి కుంభాభిషేకంను నిర్వహించారు. 1985-1997లలో దేవాలయ అభివృద్ధికోసం చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి అందులోనే కమ్యూనిటి సెంటర్, స్టాఫ్ క్వార్టర్స్, టెంపుల్ ఆఫీస్, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 1987-88లలో దేవాలయాన్ని మరింత సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన విగ్రహాలకు వెండికవచాలను అమర్చి, రెండవ కుంభాభిషేకంను సైతం నిర్వహించారు. 1993లో దేవాలయ కిచెన్‌ను ప్రారంభించారు. ఇక్కడే స్వామివారికి అవసరమైన న్కెవేద్యాన్ని తయారు చేస్తున్నారు. 1997లో కమ్యూనిటి సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు.
1998లో గణేశ పాఠశాలను ప్రారంభించి సంస్కృతం, హిందీ తదితర భాషలను నేర్పడంతోపాటు రిలిజియస్ విషయాలను, మెడిటేషన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నారు. శ్రీ మహావల్లభ గణపతితోపాటు శివ,పార్వతి, వల్లి, దేవసేన సమేత షణ్ముఖ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, నవగ్రహాలతోపాటు దుర్గ, దక్షిణమూర్తి, స్వర్ణభ్కెరవ, కామాక్షి, రామ,సీత, లక్ష్మణ, హనుమాన్, కృష్ణ రాధ, సత్యనారాయణ, రమాదేవి, బ్రహ్మ, సరస్వతి, అయ్యప్ప, సుదర్శన, నరసింహ, రాఘవేంద్ర స్వామి ప్రతిమలను ప్రతిష్ఠించారు. హిందూత్వంలోని భిన్నత్వాన్ని సూచించేటట్లుగా సత్యసాయిబాబా చిహ్నంను సొసైటీ లోగోగా తీసుకున్నారు. నార్త్ అమెరికాలో ఇండియా నుంచి వచ్చిన సామాగ్రితో నిర్మితమైన మొట్టమొదటి దేవాలయంగా శ్రీ మహావల్లభ గణపతి దేవాలయం (గణేశ్ టెంపుల్) పేరు పొందింది. ఈ దేవాలయానికి ఇంకో ప్రశస్తి కూడా ఉంది. ఇది యుఎస్ గేట్‌వే దేవాలయంగా కూడా పేరు పొందింది. ఇండియా నుంచి అందరూ తొలుత ఇక్కడకే వస్తారు. ట్క్రెస్టేట్ ఏరి యాగా పిలిచే న్యూయార్క్, న్యూ జెర్సి, కనెక్టికట్‌లలో స్థిరపడి పోయారు. ఈ దేవాలయం ఈ మూడు ఏరి యాలకు సమీ పంలోనే ఉండటం అందరికీ సౌకర్యంగా మారింది. దేవాలయానికి అవసరమైన కార్యక్రమాలకోసం చందాలు ఇవ్వడంతో పాటు కార్యక్రమాల్లో పాలుపంచు కుంటూ దేవాలయ అభివృద్ధికి అందరూ పాటుపడుతున్నారు. ఈ ఆవరణలోనే కమ్యూనిటి సెంటర్‌ను కూడా నిర్మించారు. 1998లో దీని నిర్మాణం పూర్తయింది. ఇందులోనే సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, వివాహం, ఇతర శుభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.













