నాట్స్ కోవిడ్ సేవలపై తెలుగుటైమ్స్ ప్రత్యేక సావనీర్
ప్రపంచనాన్ని పీడిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. ఆర్థిక కష్టనష్టాల పాలయ్యారు. భాషే రమ్యం-సేవే గమ్యం అన్న నినాదంతో తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) కరోనా సమయంలో అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. వేలాదిమందికి అన్నదానం చేసింది. అనాథ శరణాలయాలకు, వేల కుటుంబాలకు నిత్యావసర సరకులను అందించింది. ఫుడ్బ్యాంక్లకు విరాళాలను ఇచ్చింది. కోవిడ్ 19పై అవగాహనకోసం వైద్యుల చేత వెబినార్లను నిర్వహించింది. మరోవైపు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఆర్థిక అంశాలపై నిష్ణాతులతో ప్రసంగాలను ఇప్పించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలను నాట్స్ కోవిడ్ సమయంలో చేసింది. చేస్తూనే ఉంది.
అమెరికాలో 17 సంవత్సరాలకు పైగా కాలిఫోర్నియా నుంచి వెలువడుతున్న ‘తెలుగు టైమ్స్’ పత్రిక నాట్స్ చేసిన సేవా కార్యక్రమాలను ఇతరులకు స్ఫూర్తిదాయకంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో కోవిడ్ 19లో నాట్స్ సేవలు పేరుతో ప్రత్యేక సావనీర్‌ను వెలువరించింది. 78 పేజీల ఈ సావనీర్‌ను www.telugutimes.net లో కూడా చూడవచ్చు.













