యుఎస్ లో 3వ స్థానంలో తెలుగు భాష
అమెరికాలో విస్తతంగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు భాష మూడవ స్థానంలో ఉందని హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా తెలిపారు. అమెరికాలో నిర్వహించిన 2012-16 జనాభా లెక్కల ప్రకారం తెలుగు భాషకు ఈ స్థానం లభించిందని చెప్పారు. హైదరాబాద్ లో మంగళవారం ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వరంలో అమెరికా దేశ 242వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హడ్డా ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘అమెరికా సమాజంలో భారతీయులు.. ముఖ్యంగా తెలుగు ప్రజల ముద్ర చెరగనిది.. అమెరికా ఆర్థిక – సామాజిక ఎదుగుదలలో తెలుగు ప్రజలు కలిసిపోయి అభివద్ధికి పాటుపడ్డారని చెప్పారు.
ఇక్కడి నలుగురు కుటుంబాల్లో ఒకరికి అమెరికాలోని తెలుగువారితో సంబంధాలున్నాయి. తెలుగు ప్రజలందరూ అమెరికా కుటుంబంతో కలిసిపోయి ఎవ్వరూ ఊహించని విధంగా ముందుకు సాగుతున్నారని, తెలంగాణ – ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ అక్కడే ఉపాధి పొందుతున్నారని కేథరిన్ హడ్డా చెప్పారు. ఈ సమావేశంలోనే పాల్గొన్న ఐటీ – పరిశ్రమల శాఖమంత్రి జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ – అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని.. తెలంగాణ వాళ్లు ఎంతో మంది అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు.













