అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలుగు విద్యార్థులు
పే అండ్ స్టే వీసా కుంభకోణంలో అమెరికా ప్రభుత్వం వందమందికి పైగా భారతీయ విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకుంది. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా అనేక మంది ఉన్నారు. నిర్భంధంలో ఉన్న విద్యార్థులను బయటకు తెచ్చేందుకు అమెరికా తెలుగు సంఘాలు ఐక్యమత్యంగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క విద్యార్థిని వారు బయటకు తెస్తున్నారు. ఎట్టకేలకు బయటకు వచ్చిన 30 మంది విద్యార్థులు సోమవారం తెల్లవారుజామున భారతదేశానికి చేరుకున్నారు. అమెరికా తెలుగు సంఘాల సభ్యులు వారిని జాగ్రత్తగా హైదరాబాద్కు పంపించారు. సోమవారం ఉదయం 2 గంటలకు విద్యార్థులు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరారు. విద్యార్థులు రానున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం రాత్రంతా ఎయిర్పోర్టులో తమ పిల్లల కోసం ఎదురుచూపులు చూశారు. అమెరికా పన్నిన కుట్రలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎయిర్పోర్టులో చూశాక వారికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది.













