అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు బ్యాలెట్ పేపర్లు
నవంబర్ 3వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి బ్యాలెట్ పత్రాలపై తెలుగు అక్షరాలు ముద్రించడం పట్ల పలువురు తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌పై కూడా తెలుగు అక్షరాలు రావడం తెలుగువారిని మరింతగా సంతోషపెట్టింది. అమెరికాలో తెలుగువారి జనాభా బాగా పెరిగిపోవడంతో అమెరికాలోని స్థానిక అధికారులతో తెలుగువారు మమేకం కావడం వంటివి తెలుగు భాషా ఉనికిని బాగా పెంచాయి. దానికితోడు అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాలు తాము నిర్వహించే మహాసభలకు సెనెటర్లను, గవర్నర్లను అతిధులుగా ఆహ్వానించడం వంటివి కూడా తెలుగువారి ఉనికిని అమెరికా పెద్దల దృష్టికి తీసుకెళ్ళేలా చేశాయి.
కొంతమంది తెలుగు ప్రముఖులు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు పార్టీల తరపున కీలక ప్రచారం చేసే కమిటీల్లో కూడా ఉన్నారు. ఇలా తెలుగువారి ఉనికి బాగా పెరగడం, తెలుగువారి ఓట్లు కూడా బాగా కీలకంకావడంతో అమెరికా ప్రభుత్వం బ్యాలెట్ బాక్స్‌లపై, పత్రాలపై తెలుగు అక్షరాలను ముద్రించింది. ఇక్కడ ఉన్న ఫోటోలో అధికారిక బ్యాలట్ అంటూ తెలుగులో ముద్రించడాన్ని గమనించవచ్చు. వోట్ బై మెయిల్ బ్యాలెట్ అప్లికేషన్లో చివరన తెలుగు అక్షరాలతో ఓటరు సహాయం కోసం కాల్ చేయండి అంటూ ముద్రించడాన్ని గమనించవచ్చు.













