GWTCS, తానా పాఠశాల ఆధ్వర్యంలో – తెలుగు భాషా దినోత్సవం..

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారికి ఘన నివాళి అర్పించారు. GWTCS ఉపాధ్యక్షులు సుశాంత్ మన్నే, కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి ఈ కార్యక్రమం సమన్వయ పరచారు.
GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో మాండలికాలు. అందునా దేశభాష లందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు కాలం నుండి..నేటి వరకూ తేనెలొలుకు మన మాతృబాష తెలుగు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథిక భాషకు బదులుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే వ్యావహారిక భాషను వాడాలని జీవిత కాల ప్రచారం, పోరాటం చేశారని అన్నారు.
కార్యదర్శి భాను మాగులూరి మాట్లాడుతూ ..రామమూర్తి గారు బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త. ఆయన చేసిన కృషి వల్లే తెలుగు సాహిత్యం, విద్య సామాన్యునికి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వృత్తి ఉపాధికోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృబాష తెలుగును మన పిల్లలకు రాయటం, స్పష్టంగా చదవటం, ప్రసంగించటం నేర్పించటం మనందరి భాద్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రావ్య చామర్తి, బోనాల రామకృష్ణ, బండి సత్తిబాబు, కోటి కర్నాటి, పునుగువారి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, మేకల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.