అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో గతంలో గుజరాతీయుల హవా కనిపించేది. తరువాత పంజాబీయుల హవా మొదలైంది. ఇప్పుడు తెలుగువారి హవా మొదలైంది. అమెరికాలో నేడు తెలుగు వెలిగిపోతోంది. ఎక్కడ చూసినా, ఏ నగరాల్లో చూసినా తెలుగువారి సంఖ్య తక్కువేమి కాదు. అన్నీ చోట్లా తెలుగు మాట, తెలుగు రెస్టారెంట్లు, తెలుగు సినిమాలు, తెలుగు వారి దుకాణాలు కూడా కనిపిస్తున్నాయి. మొదటితరం తెలుగువాళ్ళు అమెరికాలో వెళ్ళినప్పుడు వారి సంఖ్య వందల్లో ఉండేది. తరువాత వెళ్ళేవారితోపాటు అక్కడివారి సంఖ్య కలిపి వేలుగా మారింది. ఐటీ ప్రాభవం మొదలైన తరువాత ఈ వందలు వేల సంఖ్య లక్షకు చేరింది. ఇప్పుడు అమెరికాలో దాదాపు 10 లక్షలకుపైగా తెలుగువారు ఉంటున్నారని అంటున్నారు. దాంతో సహజంగానే తెలుగు భాషా వైభవం కూడా విస్తరించింది.
దీంతో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వే కూడా పేర్కొంటోంది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది.
తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. ఇంకా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ వంటి వారు ఉన్నారని, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో కూడా ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో-అమెరికన్‌గా ఎంపికైంది. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్‌లో నిలవడం విశేషం. తెలుగు సంస్క తిని నిలబెట్టడం కోసం సాంస్క తిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, న త్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు.
అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగు సంఘాలు ఉన్నాయి. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న సంఘాలు కూడా అందులో ఉన్నాయి. తానా, హ్యూస్టన్, బే ఏరియా తెలుగు అసోసియేషన్ వంటివి ఇందులో పేర్కొనవచ్చు. ఈ సంఘాల ద్వారా కూడా తెలుగుభాష, సంస్కృతీ విస్తరిస్తోంది. దీంతోపాటు మనబడి, పాఠశాల వంటివి అక్కడ ఉన్న చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడం వల్ల తెలుగు భాషను మాట్లాడేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది.













