కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్న తెలుగు సంఘాలు

భారత్‍పై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు తమవంతుగా సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వల్ల, మందులు దొరక్క కోవిడ్ పేషంట్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తమవంతుగా సహాయాన్ని తెలుగుసంఘాలు అందించాయి. అమెరికాలో జాతీయ తెలుగు సంఘాలుగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అమెరికా తెలుగు సంఘం (ఆటా), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), తెలంగాణ తెలుగుసంఘం (టిటిఎ) ఈ సేవల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. మరోవైపు వివిధ నగరాల్లో ఉన్న ప్రాంతీయ తెలుగు సంఘాలైన బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), టెక్సాస్‍లోని టాంటెక్స్ తెలుగు అసోసియేషన్ ఇలా ఎన్నో ప్రాంతీయ తెలుగు సంఘాలు తమవంతుగా కోవిడ్ పేషంట్లకు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. వీరితోపాటు అమెరికాలోని భారత సంతతికి చెందిన డాక్టర్ల సంఘం ఆపి, ఎన్టీఆర్ ట్రస్ట్, ఎపిఎన్‍ఆర్‍టీ వంటి సంస్థలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఆసుపత్రులు నిండిపోయి పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కమ్యూనిటీకి తనవంతుగా సహాయపడేందుకు తానా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా అవసరమైన అత్యవసరమైన పరికరాలను, ఆక్సిజన్ కాన్సెన్‍ట్రేటర్స్, వెంటిలేటర్స్తోపాటు మందులను పంపిణీ చేస్తోంది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) తనవంతుగా కమ్యూనిటికీ సహాయపడేందుకు ముందుకు వచ్చింది. పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాకు ముందుకు వచ్చింది. ఆటా ఇతర సంఘాలతో, ఇండియన్ ఎంబసీ వర్గాలతో కలిసి ఇండియాకు అవసరమైన ఆక్సిజన్ పరికరాల పంపిణీకి ముందుకు వచ్చింది. అలాగే ఆక్సిజన్ కాన్సెన్‍ట్రేటర్‍ను దాతలు కోరినట్లుగా వారి గ్రామాల్లో, వారు కోరుకున్న చోటుకు అందజేస్తామని కూడా ఆటా ప్రకటించింది.
తెలంగాణలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడేందుకు ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ముందుకు వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు నాటా తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.5 లక్షల సహాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆక్సిజన్ పరికరాలను, అత్యవసరమైన మందులను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చింది.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) కూడా కోవిడ్‍తో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. కోవిడ్ పేషంట్లకు అత్యవసరమైన ఆక్సిజన్ పరికరాలతోపాటు, రెమిడెసివర్ ఇంజక్షన్‍లు, ఆస్పత్రుల్లో బెడ్‍ల ఏర్పాటుకు సహాయాన్ని అందిస్తోంది. ఇమ్యూనిటీ బూస్టర్స్, ఆక్సిమీటర్, విటమిన్స్ ట్యాబ్లెట్లు ఇలా ఎన్నో విధాలుగా కోవిడ్ పేషంట్లకు టిటిఎ సహాయాన్ని అందిస్తోంది.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) తనవంతుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయపడేందుకు ముందుకు వచ్చింది. నిర్మాణ్ సంస్థతో కలిసి ఈ సహాయాన్ని ఆంధప్రదేశ్‍తో పాటు, తెలంగాణ రాష్ట్రానికి అందిస్తోంది. అవసరమైన చోట బెడ్‍లు, ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాటు, మెడికల్ సిబ్బంది ఏర్పాటు వంటివి ఈ సహాయంలో భాగంగా చేస్తోంది.
టెక్సాస్ లోని టాంటెక్స్ తెలుగు అసోసియేషన్ కూడా కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‍ను ఏర్పాటు చేసి కమ్యూనిటీకి అవసరమైన పరికరాల పంపిణీకి ముందుకు వచ్చింది. అమెరికాలోని డాక్టర్ల సంఘం (ఆపి) కూడా ఈ కరోనా కష్టకాలంలో తనవంతుగా వైద్యసేవలందించడంతోపాటు అవసరమైన పరికరాలను భారత్‍కు పంపించింది.