కరోనా వేళ…ఫ్రంట్ లైన్ సిబ్బందికి తత్వా సహాయం
అమెరికాను విజృంభిస్తున్న కరోనా వైరస్ నుంచి కాపాడుతున్న వైద్యుల సేవను ప్రశంసించకుండా ఉండలేమని ట్రైవ్యాలీ తెలుగు సంఘం (తత్వా) పేర్కొంది. ఈ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్ నుంచి కాపాడుతున్న ఫ్రంట్ లైన్ సిబ్బందికి తమవంతు సాయంగా రక్షణ దుస్తులను అందించేందుతు తత్వా ముందుకు వచ్చింది. కాలిఫోర్నియాలోని థౌసండ్ ఓక్స్ లోని, లాస్రోబ్లెస్మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీ విభాగం వారి వినతిమేరకు దాదాపు 500 మాస్క్ లను, 45 హెడ్ కవరింగ్ దుస్తులను తయారు చేసి వారికి అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్లో ఇంటినుంచి పనిచేస్తూ, పిల్లల ఆన్లైన్ క్లాస్‌లతో బిజీగా ఉన్నా, నిత్యావసర సరుకుల సరఫరా విషయంలో ఇబ్బందులు ఉన్నా, కమ్యూనిటీకి సహాయం చేయాలన్న తత్వా పిలుపుతో ఎంతోమంది స్థానికంగా ఉన్న తెలుగువారు ముందుకు వచ్చి సహాయం అందించడం అభినందనీయమన్నారు. 500 మాస్క్ లలో 80శాతంకిపైగా మాస్క్ లు అంటే 400కిపైగా మాస్క్‌లను వారంరోజుల వ్యవధిలో మన తెలుగువారే స్వయంగా ఇళ్లలో తయారు చేసి ఇచ్చారని, మరికొన్ని మాస్క్ లను విరాళాలతో కొన్నట్లు తత్వా తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫ్యాబ్రిక్ దొరకడంలో ఇబ్బందులు ఉన్నాయి. దాంతో ఇంట్లో ఉన్న కొత్త బెడ్షీట్లతో, ఇండియా నుంచి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కొత్త కాటన్ చీరలను సైతం వాడి ఆసుపత్రి వర్గాలవారి స్పెసిఫికేషన్ ప్రకారం మాస్క్‌లను, హెడ్కవరింగ్స్ ను తయారు చేయడం జరిగింది. ఎన్నోరంగులు, మరెన్నో డిజైన్లు ఉన్నా అందరి లక్ష్యం ఒక్కటే సమాజసేవ చేయాలనుకునేవారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి కరోనా కష్టకాలంలో వారి సహకారాన్ని తీసుకుంది. తమకు మాస్క్‌లు ఇచ్చిన తత్వాకు ఆసుపత్రివర్గాలు ధన్యవాదాలు తెలియజేశాయి. ఎన్ 95 మాస్క్ లు ఉన్న కొరత వల్ల దానిని ప్రత్యేకమైన సమయంలో మాత్రమే వాడుతామని చెప్పారు. తత్వా అందజేసిన మాస్క్ ల వల్ల తమకు ఎంతో ఉపకరిస్తాయని లాస్రోబ్లెస్మెడికల్ సెంటర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం డాక్టర్ కార్లోరీయిస్ అన్నారు.
కమ్యూనిటీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేయడంలో తత్వా ఎప్పుడూ ముందు ఉంటుందని, వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకోసం పనిచేస్తున్నారని, వారికి సహాయం చేయడం తమకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని తత్వా నాయకులు అన్నారు. తమ సహాయం కొనసాగుతూనే ఉంటుందని, పేదలను కూడా ఆదుకుంటామని వారు చెప్పారు. వెంచురా ఫైర్‌పైటర్స్, ఫస్ట్ రెస్పాండర్స్, సిమివ్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా తత్వా ఆర్థిక సహాయాన్ని అందజేసి సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆసుపత్రివర్గాలవారితో సమన్వయంతో మాస్క్ ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీమతి శిరీషా పొట్లూరి, అనుపమ సీమకుర్తి, భారతి రాజామణి, బిందు పోలవరపు, దుర్గ వలివేటి, హైమ బుద్ధిరాజు, కాంచన్, లక్ష్మీ గోతేటి, లక్ష్మీనిస్టల, లక్ష్మీ పడాల, నీలిమ యాదల, శ్రియ పొన్నగంటి, సుహరిత అల్లు, సునీత బొప్పుడి, సునీత మరకకట్ల, తులసి అడప, విజయ కొప్పు తదితరులకు, ఆర్థిక సహాయం చేసిన దాతలకి తత్వా కార్యవర్గం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.













