టాస్క్ స్వర్ణోత్సవ సంబరాలు విజయవంతం
అలరించిన శ్రీకృష్ణ, మంగ్లీ, భిక్షునాయక్ తదితరుల సంగీత విభావరి
ప్రత్యేక ఆకర్షణగా హీరోయిన్ ఇషా చావ్లా, జోశర్మ హాజరు
దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టాస్క్) స్వర్ణోత్సవ సంబరాలు ఇటీవల వైభవంగా జరిగాయి. అక్టోబర్ 15వ తేదీన రెదోండో బీచ్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు, టాస్క్ సభ్యులు , కళాకారులు, ఇతరులు హాజరయ్యారు. 9 గంటలపాటు జరిగిన ఈ వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలను ప్రదర్శించారు. లాస్ ఏంజెల్స్ చరిత్రలోనే ఈ వేడుకలు ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని నిర్వాహకులు పేర్కొన్నారు. దాదాపు 2,500 మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టాలీవుడ్ గాయనీ గాయకులు తమ మధురగానాలతో అందరినీ అలరించారు. శ్రీ కృష్ణ, హారికా నారాయణ్, ఆదిత్య అయ్యంగార్. మంగ్లీ, భిక్షు నాయక్ తమ పాటలతో వచ్చినవారిని ఉత్సాహపరిచారు. అందాల తార ఇషా చావ్లా, బ్యూటీ పేజియంట్ విన్నర్ జో శర్మ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు గ్రేట్ గ్రాండ్ స్పాన్సర్‌గా డాక్టర్ ప్రేమ్ రెడ్డి వ్యవహరించారు. గ్రాండ్ స్పాన్సర్లుగా డా. శ్రీనివాస్ నక్క, పాటి దామోదర్ రెడ్డి వ్యవహరించారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. స్వర్ణోత్సవ సంబరాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అపురూపమైన దృశ్య కావ్యంగా పరంపరా సంస్థ వారి ‘‘గుడి సంబరాలు’’ నిలిచింది. మన ప్రాచీన మందిరాల్లోని కళా రూపాలని ప్రతిబింబిస్తూ పరంపరా వారు చేసిన ‘‘ఆహుతి’’ అద్భుత నృత్య ప్రదర్శన ప్రేక్షకుల మనసుల్లో సమ్మోహనాస్త్రం సంధించి వారిని గంటన్నర పాటు సీట్లకే పరిమితం చేసింది. అత్యద్భుత వినోద కార్యక్రమాలని అందించిన టాస్క్ సంస్థను, నిర్వాహకులను స్వర్ణోత్సవ సంబరాలకి విచ్చేసిన ప్రేక్షకులు, ఆహుతులు ప్రశంసించారు.
ప్రెసిడెంట్ రావు కల్వకోట, వారి టీమ్ వచ్చిన అతిధులను సాదరంగా ఆహ్వానించింది. అలాగే ఈ వేడుకలకు ఆర్థికంగా సహకరించిన గ్రాండ్ స్పాన్సర్లకు, డోనర్లకు, ప్రెసిడెంట్ రావు కల్వకోట ధన్యవాదాలు తెలిపారు.













