టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల జయప్రదం…

టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘నెలనెలా తెలుగు వెన్నెల’ పేరుతో జూన్ 20వ తేదీన జరిగిన 167వ సాహిత్య సదస్సు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిన్నారులు మేఘన కుప్పచ్చి, మాడ సమన్వితల ప్రార్థనా గీతాలతో సభ ప్రారంభమైంది. అమెరికాలో పితృదినోత్సవం కూడా అదే రోజు కావడంతో కార్యక్రమానికి హాజరైన వారు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. టాంటెక్స్ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి స్వీయ కవిత వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆకాశవాణి ప్రయోక్త ప్రయాగ రామకృష్ణ హాజరై.. ‘సమకాలీన కార్యనిర్వహణ, సనాతన సాహితీ మూలాలు’ అనే అంశంపై ప్రసంగించారు. ఉపద్రష్ట సత్యం ముఖ్యఅతిధి రామకృష్ణను సభకు పరిచయం చేస్తూ ఆకాశవాణికి, సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ‘మన తెలుగు సిరిసంపదలు’ ధారా వాహికలో భాగంగా ఉరుమిండి నరసింహారెడ్డి కొన్ని పొడుపు కథలు, జాతీయాలు, ప్రహేళకలు, ప్రశ్నలు, జవాబుల రూపంలో చర్చించారు. లెనిన్ వేముల మాట్లాడుతూ జగన్నాథ పండిత రాయలు రాసిన ‘రస గంగాధర’ గ్రంథం నుంచి కృష్ణ భగవానుని కీర్తించే ఒక శ్లోకాన్ని తాత్సర్య సహితంగా వివరించారు. అనంతరం ఫాదర్స్ డేను పురస్కరించుకుని మాడ దయాకర్.. చిగురుమళ్ల శ్రీనివాస్ రాసిన పద్యాలు వినిపించారు.
సభలో ప్రసంగాలపై ప్రత్యేకించి ముఖ్య అతిథి ప్రసంగంపై ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ, ఉరుమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు తమ సహృదయ స్పందన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణపాలేటి, నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పచ్చి తదితర సభ్యులు, సాహిత్య ప్రియులు హాజరయ్యారు.