Tampa: వైభవంగా ఫ్లోరిడా తెలుగు సంఘం ఉగాది వేడుకలు
విశ్వావసు నామ సంవత్సర ఉగాది (Ugadi) వేడుకలను ఫ్లోరిడా తెలుగు సంఘం వారు వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ 5వ తేదీన ఐసిసి హాల్లో సంఘం అధ్యక్షుడు శ్రీధర్ యర్రంశెట్టి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఫ్లోరిడా టాంపా బే ప్రాంతంలో ఉన్న తెలుగువాళ్ళు ఈ వేడుకలకు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను, వివిధ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పలువురు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6వరకు డ్యాన్స్ పోటీలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి 10 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలతోపాటు స్థానిక కళాకారులతో ఇతర ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. శిరీష ఎంసిగా వ్యవహరించారు. గాయని నూతనమోహన్, గాయకుడు మల్లిఖార్జున్ తమ పాటలతో అందరినీ అలరించారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ భావన దుర్గం, డిజే సాత్విక్ కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
అధ్యక్షుడు శ్రీధర్ యర్రంశెట్టి (Sreedhar Yerramesetty) మాట్లాడుతూ, ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, సభ్యులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో తన హయాంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలియజేశారు. 2024 అక్టోబర్ 26న దసరా, దీపావళి, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిపామని, తరువాత 2025లో సంక్రాంతి వేడుకలను నిర్వహించామని, ఇప్పుడు ఉగాది వేడుకలను కూడా వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఉగాది వేడుకల విజయవంతానికి సహకరించిన స్పాన్సర్లకు, వలంటీర్లకు తన టీమ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
అధ్యక్షుడు శ్రీధర్ యర్రంశెట్టి, వైస్ ప్రెసిడెంట్ మాధవి యార్లగడ్డ, సెక్రటరీ జి.ఎ. విష్ణునాయుడు, ట్రెజరర్ సునీత పరుచూరితోపాటు డా. మహతీరెడ్డి, సుధ బిందు బండ, మూర్తి ఎల్లా, డా. జానకినారాయణ్, వీరారెడ్డి తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.








