అమ్గోత్ తుకారాం మరో ఘనత
గిరిజన యువ పర్వతారోహకుడు అమ్గోత్ తుకారాం మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ప్రపంచంలోని మూడు ఎత్తైన పర్వతాలను అధిరోహించిన తుకారాం దక్షిణ అమెరికాలోని అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతారోహణకు మొత్తం ఏడుగురు వెళ్లగా, వారిలో తుకారాంతోపాటు మరో ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. భారత గణతంత్ర దినోత్సవం నాడు పర్వతాన్ని అధిరోహించిన తుకారాం బృందం అక్కడ జన గణ మన.. గీతాన్ని ఆలపించారు. ఆయన గత తొమ్మిది నెలల్లో మూడు పర్వతాలను అధిరోహించాడు.
2019 మే 22న ఆసియాలోని ఎవరెస్టు శిఖరం, జూలై 27న రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. అంతకుముందు 2018 జులై 4వ తేదీన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. చిన్న వయస్సులోనే ప్రపంచంలోని నాలుగు ఎతైన పర్వతాలను అధిరోహించిన తుకారాం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందినవాడు. అకాన్కాగో పర్వతారోహణకు ఆర్థిక సాయం అందజేసి, ప్రోత్సహించిన త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.













