అమెరికాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమం, ఆచార్య జయశంకర్, విద్యాసాగర్‌రావు చేసిన సేవలను టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కొనియాడింది. అమెరికా బే ఏరియాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఆవిర్భావ వేడులు, హరీష్‌రావు జన్మదినం సందర్భంగా సందేశం ఇవ్వాలని కోరారు. దీంతో ఫోన్లో హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నేటి అభివృద్ధిలో టీఆర్ఎస్ ఎన్నారైలది కీలకపాత్ర అని అన్నారు. అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించి మన ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్నారై ప్రతినిధులకు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి.. దీక్షా ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించి.. బంగారు తెలంగాణ దిశగా ప్రజా పరిపాలన సాగిస్తున్నారన్నారు. కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమ యోధుడు జయశంకర్ చేసిన సేవలను, అదేవిధంగా నీటి పారుదల రంగంలో చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బైరీ పూర్ణ, జొన్నలు ఉదయ్, శివ, రాము, జగన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.













