టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ఉపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆయన మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధిలో మహిళల పాత్రను అద్భుతంగా వివరించారు. మహిళలు ఇకపై కూడా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, ఏసీ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, ఏసీ కో-ఛైర్ డాక్టర్ మోహన్ పట్లోల్ల, ఏసీ డాక్టర్ విజయపాల్ రెడ్డి కూడా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడారు. ఆరోగ్య శాఖలో మహిళలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో ఆమె వివరించారు. మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమెను ‘టీటీఏ-వుమెన్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో టీటీఏ సత్కరించింది. అనంతరం మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించడం తదితర అంశాలపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని టీటీఏ మహిళా నేతలు స్వాతి చెన్నూరి, సంగీత రెడ్డి, కవిత రెడ్డి, ఉషా రెడ్డి, రామ వనమ, ప్రియాంక తదితరులు విజయవంతంగా నిర్వహించారు. వీరందరికీ టీటీఏ ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకల్లో ‘టీటీఏ-మహారాణి’ పేరిట అందాల పోటీలు కూడా నిర్వహించారు. ఈ పోటీల్లో రమ్య అయ్యంకి విజేతగా నిలవగా.. నీలిమ బొడ్డు మొదటి రన్నరప్, సౌమ్య పందిరి రెండో రన్నరప్ అవార్డులు అందుకున్నారు.













