హెచ్4 ఇఎడి రెన్యూవల్ గడువు పెంచాలని కోరుతున్న నిరంజన్ టీమ్
భారతీయులకు ఇబ్బందులు సృష్టిస్తున్న హెచ్ 4 ఇఎడి గడువు ముగిసిన తరువాత దానిని రెన్యూవల్ చేసుకునే సమయంలో గడువు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిని తప్పించాలంటే గ్రీన్‌కార్డ్ ఇఎడికి ఉన్నట్లుగానే 180రోజుల వెసులబాటును ఈ హెచ్4 ఇఎడికి కూడా కల్పించాలని తానా అధ్యక్ష బరిలో ఉన్న నిరంజన్ శృంగవరపు, ఆయన టీమ్ కోరుకుంటోంది. దీనిపై నిరంజన్ శంగవరపు పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, న్యాయ కోవిదులతో ఓ సదస్సును ఇటీవల నిర్వహించారు. మిచిగన్‌కు చెందిన బోమన్, మేరీల్యాండ్‌కు చెందిన మూర్తి న్యాయ కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యుల కార్యాలయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
హెచ్4 ఇఎడి దరఖాస్తుదారులు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నాక నిర్ణీత గడువులోగా వారి దరఖాస్తు రెన్యూవల్‌కు నోచుకోకపోతే వీరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యాపారాలు స్థాపించిన వారు తమ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను అధిగమించడానికి గ్రీన్ కార్డ్ ఇఎడి తరహాలో హెచ్4 ఇఎడికి కూడా 180రోజుల వెసులుబాటు కల్పించాలని నిరంజన్ ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు విన్నవించారు. ఈ మేరకు వచ్చే వారం నిరంతరంగా పలువురు కాంగ్రెస్ సభ్యులు, న్యాయ కోవిదులతో సెమినార్లు నిర్వహించి చర్చించనున్నామని భారతీయులకు ఈ నిబంధన ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.













