ఎన్నారైలను ఆకట్టుకున్న స్వాతి రెడ్డి
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గాయని స్వాతిరెడ్డి స్వయంగా కంపోజ్ చేసిన ‘తెలుగు నేలపైన పూలు చల్లరా’ పాట అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు నేలకు పూలమాల పేరుతో ఆమె తాను పాడిన పాటల సీడిని నిజామాబాద్ ఎంపి కవిత చేతుల మీదుగా ఆవిష్కరించుకుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన స్వాతిరెడ్డి పెళ్ళయిన తరువాత లండన్‌లో స్థిరపడింది. లండన్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో పాటలను పాడి అందరినీ ఆకట్టుకుంది. అక్కడే స్థిరపడిపోయింది. యాంకర్‌గా కూడా మంచి పేరును తెచ్చుకుంది. బతుకమ్మ పాటలను పాడటంలో ఆమె గానమాధుర్యం అందరికీ ఎంతగానో నచ్చింది. దాంతో వివిధ దేశాల్లో బతుకమ్మ వేడుకల్లో ఆమెను పాడాల్సిందిగా ఎంతోమంది ఆహ్వానించారు.
స్విట్జర్లాండ్, డెన్మార్క్, బ్యాంకాక్ ఇలా వివిధ చోట్ల ఆమె బతుకమ్మ పాటలను పాడింది. లండన్‌లో తెలుగు పిల్లల కోసం సంగీత పాఠశాలను కూడా ఆమె నిర్వహిస్తోంది. మాతృభాషపై మమకారంతో ఎన్నారైలు తమ పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని అప్పుడే తెలుగు భాషపై మమకారం పెరుగుతుందని ఆమె చెబుతోంది. హైదరాబాద్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన ప్రవాసి దివస్‌లో కూడా ఆమె పాటలను పాడింది. తెలుగు వైభవాన్ని చాటేలా వివిధ చోట్ల పాటలను పాడటమే తన లక్ష్యమని అంటోంది.













