సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను తెలిపిన టీడిఎఫ్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం, అమలు, ప్రాముఖ్యతపై జైకిసాన్ ద్వారా రైతులకు అవగాహనా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. సిరిసిల్లా ముస్తాబాద్ లో జరిగిన ఈ అవగాహనా కార్యక్రమానికి ఎంతోమంది రైతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐసీఏఆర్ జాతీయ అవార్డు గ్రహీత మావురం మల్లికార్జున రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరై, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేశారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యత, అవలంబించాల్సిన పద్ధతులను వారికి విడమర్చి చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ట్రైనర్, గ్రామ భారతీ ప్రధాన కార్యదర్శి సామ ఎల్లారెడ్డి కూడా ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. సేంద్రీయ వ్యవసాయంలోని వివిధ రకాల పద్ధతులు, పంటలు పండించే విధానం, సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత మొదలైన అంశాలపై ఓ గంట పాటూ వివరించారు. ఈ శిక్షణా తరగతులకు 150 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. దీంతో నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారికి తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వారు ఔత్సాహికులకు అవసరమైన డ్రమ్ములు, ఇతర సామాగ్రిని అందజేశారు. సేంద్రీయ వ్యవసాయం చేసే వారిని, ప్రోత్సహించడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేయడమే తమ ధ్యేయమని, సేంద్రీయ వ్యవసాయంతో భూమిని, ప్రకృతిని కాపాడిన వారమౌతామని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చేయూతనిచ్చిన టీడీఎఫ్ అమెరికా రైతు సంఘం చైర్మన్ ప్రీతీ రెడ్డికి టీడీఎఫ్ ఇండియా ఛాప్టర్ ధన్యవాదాలు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి టీడీఎఫ్ అధ్యక్షుడు వట్టే రాజా రెడ్డి, మట్టా రాజేశ్వర రెడ్డి, టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు మురళీ చింతలపాణి, టీడీఎఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కరకాల కష్ణారెడ్డి, శివనాథ రెడ్డితో పాటు స్థానికులు హాజరయ్యారు.













