బ్రాహ్మణ కుటుంబాలకు టీడిఎఫ్ సహాయం
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడిఎఫ్) అమెరికా ఆధ్వర్యంలో ఇండియాలో ఉన్న టీడిఎఫ్ విభాగం వారు కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. టీడిఎఫ్ అధ్యక్షురాలు కవితా చల్లా ఆధ్వర్యంలో ఈ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జంటనగరాల్లో వివిధ చోట్ల వారు నిర్వహించిన సహాయక కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. మే 30వ తేదీన శనివారంనాడు హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట్ డిడి కాలనీలో ఉన్న అహోబిలమఠంలో, నగరంలోని మరో చోట నిర్వహించిన కార్యక్రమాల్లో దాదాపు 50మంది బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
అమెరికాలో ఉంటున్న కవితా చల్లాతోపాటు వారి స్నేహితులు అందించిన విరాళంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీడిఎఫ్ ఇండియా టీమ్ ప్రెసిడెంట్ వట్టె రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోబిలమఠం మేనేజర్ పరవస్తు శ్రీనివాసన్ మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా చాలామంది బ్రాహ్మణులు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు టీడిఎఫ్ ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. టీడిఎఫ్ అధ్యక్షురాలు కవితా చల్లాకు, టీడిఎఫ్ ఇండియా నాయకులు రాజారెడ్డి, రాజేశ్వర్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
టిడిఎఫ్కు సంబంధించిన ఇతర వివరాలకోసం సంస్థ వెబ్సైట్ను చూడండి.
For more information please visit www.telangana.org













