ఘనంగా టిడిఎఫ్ బతుకమ్మ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడిఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అక్టోబర్ 25వ తేదీన నాలుగు గంటలపాటు జరిగిన ఈ నాన్ -స్టాప్ తెలంగాణా ధూమ్ ధామ్ వర్చువల్ పోగ్రాం (ఇండియా నుండి)ను టీడీఎఫ్ చైర్ పర్సన్ రామ్ కాకులవరం, ప్రెసిడెంట్ కవిత చల్ల స్వాగత పలుకులతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీడిఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ స్వాగత గీతం అందరినీ అలరించింది. గోరెటివెంకన్న, దేశపతి శ్రీనివాస్ గారు రాసిన రెండు గీతాలను టీడిఎఫ్ సంబరాల ఆవిష్కరణ గీతాలను అందరు గాయకులు కలసి పాడి శ్రోతలను అలరించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డి.కే అరుణ పాల్గొని మాట్లాడుతూ, బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను జూమ్ ద్వారా అందరికీ తెలియజేశారు. గత సంవత్సరం వాషింగ్టన్ డి.సిలో జరిగిన బతుకమ్మ సంబరాలలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా టీడిఎఫ్ వాళ్ళు నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాల్లో జూమ్ ద్వారా పాల్గొనే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. టీడిఎఫ్ మన తెలంగాణ సంస్కృతిని మన రాబోయే తరాలకు అందివ్వడంలో చాలా ముందుంది. అమెరికాలో ఉంటూ, అక్కడి పిల్లలు పెద్దలు ఉత్సాహంగా బతుకమ్మ ఆట పాటలలో పాల్గొనడం ప్రత్యక్షంగా చూశానని, కోవిడ్ 19 సంక్షోభం నుంచి మనం అంతా బయటపడి మళ్ళీ అందరం ఉత్సాహంగా అన్ని పండుగలు జరుపుకునే రోజులు రావాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలను ఆమె తెలియజేశారు. మాజీ ఎం.ఎల్.ఏ పద్మావతి మాట్లాడుతూ ముందుగా అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు చెబుతూ, గత సంవత్సరం అమెరికాలో జరిగిన టి.డి.ఎఫ్ సమావేశాల్లో పాల్గొనడం అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఈవర్చువల్ మీటింగ్ కి పిలవడం చాలా సంతోషమని చెప్పారు. ఎమ్మెల్సీ. రైతుబంధు కమిటీ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి పల్లా మాట్లాడుతూ అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మాట్లాడమన్న నిర్వాహకులకు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందరికీ వివరించారు. రైతులకోసం రైతుబంధు పథకం, రైతు భీమా, రైతు కళ్లాలు ఇలా ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, చాలా గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలును ప్రారంభించిందన్నారు. అందరికీ తాగునీరు సాగునీటీ వసతికోసం కృషి చేస్తోందని కూడా చెప్పారు.
ఎమ్మేల్యే, గాయకుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీడీఎఫ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తీరొక్కపువ్వుని తీసుకొచ్చి బతుకమ్మ పేర్చినట్టు, టీడీఎఫ్ కూడా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలంగాణ కళాకారులని, మేధావులని ఉద్యమకారులని ఒక్క త్రాటిపైకి తెచ్చి తెలంగాణ సంస్కృతిని ఎలుగెత్తి చాటి తెలంగాణ నినాదాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో సహకరించిందని చెప్పారు. అనేక కొత్త సంస్థలు వచ్చినప్పటికీ టీడీఎఫ్ తన ఉనికిని ఎప్పుడూ చాటుకుంటేనే ఉందని చెపుతూ కొన్ని పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. ఈ కరోనా ఇబ్బందులు లేనట్టయితే, టి.డీఎఫ్ ఈ బతుకమ్మ దసరా సంబరాలను ఘననీయంగా చేస్తూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. టిడిఎఫ్ కార్యవర్గం తెలంగాణ సంస్కృతి పట్ల పడుతున్న శ్రమ, ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నంగా భావించుకుంటూ నాకు టీడీఎఫ్ ఒక మాతృసంస్థ లాంటిది అని అన్నారు. ఎందరో తెలంగాణ కళాకారులని అమెరికాకు తీసుకువచ్చిన ఘనత టీడీఎఫ్ కే చెందిందని కూడా రసమయి బాలకిషన్ అన్నారు.
టి.డి.ఎఫ్ పాస్ట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అనుగు మాట్లాడుతూ టీడీఎఫ్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నదని, ఉత్సాహంగా పనిచేసే ఎందరో కార్యకర్తల సమాహారమే టీడీఎఫ్ అని అన్నారు.
టీడీఎఫ్ మాజీ చైర్మైన్, ఫౌండర్ గోపాల్ రెడ్డి గాదె మాట్లాడుతూ అందరికీ దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ టి.డి.ఎఫ్ ప్రారంభించిన రోజుల్లో తెలంగాణ అంటే చాలామంది తెలంగాణా ఎన్నారైల్లో ఎలాంటి ఉత్సాహం ఉండేదికాదు. అందుకనే మేము మన ప్రత్యేక తెలంగాణా సంస్కృతికి, గుర్తింపుని ఎన్నారైలకి పరిచయం చేయాలనుకున్నాం. మధుసూదన్లాంటి ఎందరో మిత్రుల సహకారంతో తెలంగాణ పిక్నిక్ లని ప్రారంభించాము ప్రతి స్టేట్‌లో మన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి చూసిన కవిత కల్వకుంట్ల ఆ తర్వాత బతుకమ్మని జాగృతి పేరుతొ జరిపేందుకు కూడా టీడీఎఫ్నే స్ఫూర్తి అని చెప్పారు. ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన టీడీఎఫ్ ఇప్పుడు అటు ఇండియాలో ఇటు అమెరికాలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది అని గర్వంగా చెబుతున్నానని తెలిపారు.
టిడిఎఫ్ ప్రెసిడెంట్ కవిత చల్ల మాట్లాడుతూ ‘‘టి.డి.ఎఫ్ ఇరవైసంవత్సరాల క్రితం తెలంగాణా అభివృద్ధే ధ్యేయంగా జయశంకర్ సార్ మరియు జనార్దన్‌రావు చేతుల మీదుగా అమెరికాలో ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో టిడిఎఫ్ చురుకుగా పాల్గొంది అని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమయిన అతిపెద్ద పండుగ బతుకమ్మని ప్రపంచానికి పరిచయంచేస్తూ ఘనంగా నిర్వహించిందని, ఇప్పుడు ఈ పండుగ టి.డి.ఎఫ్ సిగ్నేచర్ కార్యక్రమంలా టి.డి.ఎఫ్ లో అంతర్భాగం అయ్యిందన్నారు. అటు ఇండియాలో, ఇటు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో టి.డి.ఎఫ్ తన కార్యక్రమాలను, అభివృద్ధి పనులని అమలు చేస్తుంది. ప్రతీ సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం చాలా గౌరవంగా భావించే గౌరమ్మని ప్రతీసారీ కొలిచినట్టే అని చెప్పారు. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో కూడా ఆన్లైన్ పద్ధతిలో సాంప్రదాయాన్ని కొనసాగించడానికి టి.డి.ఎఫ్ సిద్ధపడింది. ఈ మహమ్మారి నుండి రక్షించి అతి త్వరలో ఇంతకు ముందులాగ అందరం, సంతోషంగా బతుకమ్మ పండుగలు జరుపుకునే రోజురావాలని ఆశిస్తున్నాను అని అన్నారు. ఈసారి టీడీఎఫ్ ప్రత్యేక బతుకమ్మ పాటని కూడా రూపొందించింది. ఈ పాటకు సహకరించిన వారికి మరియు కళాకారులు ప్రత్యక్షంగా వచ్చి తమ ఆటపాటలతో మనందరినీ అలరించినందుకు, అందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు చెప్పారు. అడగగానే ఆన్లైన్లో వచ్చి తమ అమూల్య సందేశాన్ని బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియచేసిన ప్రజాపతినిధులకి అందరికీ పేరుపేరున ధన్యవాదములు తెలిపారు. అన్ని సిటీ ఛాఫ్టర్స్ చేసిన బతుకమ్మ పండుగ విశేషాలను వీడియోల రూపంలో ఈ సందర్భంగా ప్రదర్శించారు.
అట్లాంటా నుంచి బోర్డు అఫ్ ట్రస్టీ, మన తెలంగాణ బడి ప్రాజెక్ట్ చైర్పర్సన్ బాపు రెడ్డి కేతిరెడ్డి స్కూల్ చేయూత కార్యక్రమాల గురించి చెప్పారు. బోర్డు అఫ్ ట్రస్టీ, టిడిఎఫ్ జాయింట్ ట్రెజరర్, జై కిసాన్ రైతులప్రాజెక్ట్కి చైర్‌పర్సన్‌గా ఉన్న ప్రీతి చల్ల చికాగో నుంచి మాట్లాడుతూ తమ సభ్యులంతా కలిసి రైతు సంక్షేమ చేయూత కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. జైకిసాన్, మనబడి, వలస దారులకు, వికలాంగులకి, అర్చకులకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరిస్తున్న టిడిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ వట్టె రాజారెడ్డి, టిడిఎఫ్ ఇండియా సెక్రటరీ మట్ట రాజేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు
వృత్తిరీత్యా డాక్టర్ అయిన దివేష అన్నిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసుల్ని ఉటంకిస్తూ కోవిడ్ రెండవ వేవ్ వస్తుందని ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని, అతి త్వరలో వాక్సిన్ వస్తుందని తెలిపారు. ఆయన తన సొంత గ్రామం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సెయింట్ లూయిస్‌లో ఉంటున్న బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ప్రవీణ్ సింగిరికొండ, తన ప్రాంత చాప్టర్ కార్యక్రమాలు గురించి వివరించారు. శ్రీని అనుమాండ్ల టిడిఫ్ బోర్డు అఫ్ ట్రస్టీ, పోర్ట్లాండ్చాప్టర్ చైర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో టీం చేస్తున్న పలు సంస్కృతిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ హైదరాబాద్ నగరం లోని గుంటి జంగయ్య నగర్ వరద బాధితులకు పోర్ట్లాండ్ చాప్టర్ టీం ద్వారా ఎన్నారైల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణి చేసినట్లు చెప్పారు. టిడిఎఫ్ అడ్వయిజర్ మధుసూదన్ కే రెడ్డి, టీ రాంచందర్ రెడ్డి టీడీఎఫ్ మొదటి చైర్మన్, అనివార్య కారణాల వల్ల ఈ?ఆన్లైన్ కార్యక్రమానికి రాలేక పోయిన తమ తరపున అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూయార్కు తెలంగాణ అసోషియేషన్ (నైటా) చైర్మన్ శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ ‘‘అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడూ ఏదో ఒక హాల్ లో కొన్ని వందలమంది మాత్రమే జరుపుకునే కార్యక్రమం ఇప్ప్పుడు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవేదికగా జరుపుకోవడం, చాలా అద్భుతమైన విషయం అన్నారు.
సింగర్స్ మధుప్రియ, కార్తిక్ కొడకండ్ల, దండేపల్లి శ్రీనివాస్, స్వర్ణక్క, రేలా రేలా గంగ తమ ఆటపాటలతో దుమ్ము లేపారు. మిమిక్రీ రమేష్ తన మిమిక్రీ డైలాగులతోనే కాకుండా పాటలను పాడుతూ కూడా శ్రోతల్ని అలరించారు.
టీడీఎఫ్ అధ్యక్షులు కవిత చల్ల ధన్యవాదములు చెపుతూ ఈ వర్చువల్ తెలంగాణ సంబరాలను ఇంత విజయవంతం చేయడంలో ఏ.బి.ఆర్ ఛానెల్ నిర్వాహకుల కృషి ఎంతో ఉంది అని, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తిచేసి, ఎన్నో కొత్త ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని పురోగమనం వైపు మళ్లించిన మన తెలుగు ముద్దుబిడ్డ , మాజీ ప్రధాని పీ.వీ.నరసింహ్మారావు గారికి భారతరత్నఇవ్వాలని కోరుతున్న అనేక తెలుగుసంఘాల డిమాండు తో ఏకీభవిస్తూ, అనేక ఇతర ఎన్నారై సంఘాల నేతృత్వంతో, టి.డి.ఎఫ్ కూడా పీ.వీ.నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కవిత చల్ల ప్రకటించారు. టిడిఎఫ్ కార్యక్రమాలను ప్రసారంచేస్తున్న సహకరిస్తున్న మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు.
చివరగా టీడీఎఫ్ చైర్పర్సన్ రామ్ కాకులవరం, మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ అనుగు, టీడీఎఫ్ ఎగ్జిక్యూటివ్ టీం కు, బోర్డు అఫ్ ట్రస్టీస్‌కు, సిటీ చాప్టర్ కోఆర్డినేటర్స్ కు, బతుకమ్మ లేడీస్ టీమ్స్ కు అన్ని సిటీస్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషం గా ఉందని అన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికీ, పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు.













