తత్వా జల్సా సంబరాల సందడి
తత్వా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ) వారి సంవత్సరాంత కార్యక్రమం జల్సా (సంబరాల సందడి)
”తత్వా” వారు అగోరా హిల్స్ పట్టణం, కాలిఫోర్నియాలో డిసెంబర్ 2018లో నిర్వహించిన జల్సా కార్యక్రమంలో 400 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలో కల్లోలం సృష్టించిన దావానలంలో తమ ప్రాణాలొడ్డి అత్యంత ధైర్యసాహసాలతో పోరాడి ప్రాణనష్టం మరియు ఆస్థి నష్టం కలగకుండా ఆపిన వెంచురా కౌంటీ అగ్నిమాపక దళం సిబ్బందికి కృతజ్ఞాతిభివందనలు తెలిపి, ఉడుతాభక్తిగా తత్వా సేకరించిన నిధులు సమర్పించారు. అగ్నిమాపక దళం సిబ్బంది ప్రతినిధులుగా విచ్చేసిన డేవిడ్, మైఖేల్ మరియు రయన్ ప్రసంగిస్తూ, ఇటువంటి గుర్తింపు తమకు ఎంతో ఆత్మబలాన్నిస్తుందనీ, మరింత ప్రేరణతో తమ విధులను నిర్వర్తించేలా చేస్తుందని అన్నారు. తత్వా నిర్వహించే సంఘ సేవా కార్యక్రమాలు భావితరాలకు మంచి ఉదాహరణలుగా మరియు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీకాంత్ సందుగు సాంస్కృతిక కార్యనిర్వాహకునిగా వ్యవహరించి ప్రేక్షకులని తన పాటలతో మరియు వ్యాఖ్యానంతో ఉర్రూతలూగించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
ముందుగా బాలబాలికలు గణేష్ ప్రార్థనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత సుమారు 90 నిమిషాల పాటు 5 నుండి 17 సంవత్సరాల బాలబాలికలు తమ గాన, నృత్య మరియు నాటక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. మహిళామణులు సైతం తామేమీ తీసిపోమన్నట్టుగా, తమ నాట్యంతో విచ్చేసిన ప్రేక్షకులందరినీ అలరించారు. ముఖ్యంగా చిన్నారులు తమంత తాముగా కూర్చుకుని ప్రదర్శించిన నృత్య రూపకాలు ”మోహినీ భస్మాసుర” మరియు ”శివ తాండవం”, పౌరాణిక నాటిక ”దానవీరశూర కర్ణ” ప్రేక్షకులను సమ్మోహితులను చేసాయి.
అనంతరం శ్రీకాంత్ సందుగు సుమారు గంటసేపు ఆహూతులందరినీ హుషారైన పాటలతో నాట్యం చేయించారు. చిన్నా పెద్దా అందరూ శ్రీకాంత్ పాటలకు తమ చిందులతో జల్సా చేసారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలందరికీ ”తత్వా” నిర్వాహకులు జ్ఞాపికలు అందచేసి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసారు. ”గ్రాండ్ బావర్చీ” వారందించిన రుచికరమైన సంపూర్ణ విందు భోజనాన్ని అందరూ ఆనందంగా ఆస్వాదించారు.
చివరిగా, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆహూతులకు, ప్రదర్శకులకు, వాలంటీర్లకు మరియు స్పాన్సర్లకు ”తత్వా” కార్యనిర్వాహకవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలియచేసారు. విచ్చేసిన వారంతా, ”తత్వా” ముఖ్యోద్దేశాలైన, మాసవారీ ఆరోగ్య కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలు మరియు చిన్నారులలోని ప్రతిభకు వేదికనిచ్చేలా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ ఉపయోగదాయకావాలని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.













