TANA: తెలుగు సంస్కృతిని కళ్లకుగట్టిన ‘తరతరాల తెలుగు వైభవం’ నృత్యరూపకం
తానా (TANA) 24వ కాన్ఫరెన్స్ రెండో రోజు కూడా ఘనంగా జరిగింది. సుమారు వంద మంది కళాకారులతో ‘తర తరాల తెలుగు వైభవం’ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టేలా కళా రత్న కేవీ సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన ఈ డ్యాన్స్ డ్రామా అందర్నీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన చేసిన కళాకారులంతా మూడు వారాల పాటు ప్రాక్టీస్ చేసి ఈ నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల్లో కనిపించే వివిధ సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ ఇచ్చిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి, కాకతీయుల రుద్రమ, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహోన్నత తెలుగు చక్రవర్తులను ఈ ప్రదర్శనలో గుర్తుచేసుకున్నారు. అలాగే కవిత్రయం, బమ్మెర పోతన, అల్లసాని పెద్దన, వేమన, అన్నమయ్య, శ్రీ రామదాసు, త్యాగరాజు వంటి కవుల విశేషాలను వివరించారు.
తెలుగు సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న పేరినీ, కూచిపూడి వంటి నృత్యాలను కూడా ప్రదర్శించారు. అనంతరం తెలుగు వారి పుణ్యక్షేత్రాలైన తిరుపతి, విజయవాడ, భద్రాచలం, యాదాద్రిని సైతం గుర్తుచేశారు. తిరుపతి వేంకటకవులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు వంటి ఆధునిక కవుల గొప్పదనాన్ని వివరించారు. తెలుగు ప్రజలు చేసుకునే ప్రముఖ పండుగలైన సంక్రాంతి, ఉగాది, దసరా, బతుకమ్మ సంబరాలను ప్రదర్శించారు. చివరగా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారంతా ఒక్కటేనని, ఈ భాషను, సంస్కృతినీ మరింత విస్తృతంగా ప్రచారం చేయాలనే సందేశాన్నిచ్చారు.
ఈ ప్రదర్శన ముగిసిన అనంతరం ప్రేక్షకులంతా లేచి నిలబడి మరీ కరతాళ ధ్వనులతో కళాకారులను, కేవీ సత్యనారాయణ గారిని అభినందించారు. ఈ క్రమంలోనే బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నాగేంద్ర శ్రీనివాస్, కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, ప్రముఖ నటులు మురళీ మోహన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాన నవీన్ యెర్నేని, హీరో నిఖిల్ అంతా కలిసి కేవీ సత్యనారాయణకు సన్మానం చేశారు. ఈ ప్రదర్శనలో శ్రీకృష్ణదేవరాయలుగా టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు నటించడం గమనార్హం.







