TANTEX: టాంటెక్స్ ఉగాది కవి సమ్మేళనం విజయవంతం
డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, (TANTEX) ”నెలనెల తెలుగువెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 213 వ సాహిత్య సదస్సు 2025 ఏప్రియల్ నెల 27 వ తేదీ న ఆదివారం నాడు డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించబడింది. నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా విశ్వావసు నామసంవత్సర శుభాకాంక్షలతో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం న భూతొ నభవిష్యత్ అన్నట్లుగా సాహితీ ప్రియులను అలరించింది. తొలుత శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ”వల్లభ నాయకా ”ప్రార్ధన గేయాన్ని కుమారి సమన్విత మాడా వీనుల విందు ఆలాపనతో సదస్సును ప్రారంభించడం జరిగింది. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ టాంటెక్స్ 200 వ సదస్సు కు గాను ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లికృష్ణ వ్రాసిన ”నెల నెలా -తెలుగు వెన్నెలా ” గీత వైశిష్ట్యాన్ని కొనియాడి, ఆ సుమధుర గీతాన్ని మరొకసారి వినిపించడం జరిగింది.
తరువాత పాలక మండలి ఉపాధిపతి మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా తన తొలి ప్రసంగంలో ప్రభవాది 60 తెలుగు సంవత్సరాల చరిత్ర విశిష్టతను వివరిస్తూ రాశి ని బట్టి ఆదాయ వ్యయాలను లెక్కించే పద్ధతులతో సహా పంచాంగ శ్రవణము నిర్వహించారు.
అంతేకాకుండా “కింకర్తవ్యం” స్వీయ కవితను గానం చేసిన శ్రీ దయాకర్ మాడ కాయగూరల ఆకుకూరల తెలుగు పేర్లు స్ఫురించేలా తమాషా క్విజ్ అద్భుతంగా నిర్వహించారు. టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ పొట్టిపాటి తమ ఉగాది సందేశంలో విశ్వావసు నామ ఉగాది నూతన సంవత్సరమంతా ఇక్కడి తెలుగువారు సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్షించారు.
ఉగాది కవిసమ్మేళనాన్ని పురస్కరించుకొని నేటి సాహితీ సదస్సుకు ఇండియా నుండి పాల్గొన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి మోహిత కౌండిన్య సుస్థిర ప్రగతి దిశను నిర్దేశించే ”పుటల మధ్య ప్రపంచం” శీర్షికన తాను వ్రాసిచదివిన అద్భుతమైన కవిత వీక్షకులను కట్టిపడేసింది. టాంటెక్స్ పూర్వపు పాలకమండలి అధ్యక్షులు శ్రీ అనంత్ మల్లవరపు ఇంకా శ్రీ వెంకట్ కొత్తూరు ”విశ్వావసు ఉగాది” స్వీయకవిత, కెనడా నుండి శ్రీమతి సువర్ణ విజయ శ్రీరాముని పాదుకలు అంశంగా వ్రాసి ఆలపించిన పద్యాలతో పాటు కోలగట్టు కవితా గానం, చిరంజీవి ధన్వీన్ బ్రాహ్మణపల్లి చెప్పిన ఉగాది కాలమానం, ఏనుగు లక్ష్మణ కవి(సుభాషిత అనువాద) పద్యాలు, కుమారి నవ్య కొప్పిశెట్టి గానం చేసిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి విరచిత ”ఎవరు వారు… వచ్చేరు” అనే పంచాంగ శ్రవణ మిళిత ఉగాది పాట, చిరంజీవి శ్రేష్ఠ మిర్యాలచెప్పిన ”ఉగాది ప్రత్యేకత”, చిరంజీవి మహతి ఆలమూరు గానం చేసిన భాగవతములోని ”శారదా నీరదేందు”, ”నీ పాదకమల సేవయు” వంటి భక్తి రస పద్యాలు, చిరంజీవి కృష్ణ భరద్వాజ్ ఆలమూరు పాడిన ”అమ్మలగన్న యమ్మ, శ్రీకృష్ణా యదుభూషణా” వంటి భాగవత పద్యాలు, చిరంజీవి హరిణి మానమ్ పాడిన ”ఉగాది వచ్చింది’ ‘కవిత గానం, ప్రముఖ గజల్స్ రచయిత విజయలక్ష్మి కందిబండ ”అత్తగారు” కలం పేరుతో వ్రాసిన ”ఉగాది పండుగ” గజల్ గానం, శ్రీకాశ్యప్ పాడిన ”దేశ భాషలందు తెలుగు లెస్స’ ‘అనే పద్యం, డాక్టర్ నక్త రాజు ”ఎవరో వస్తారని” స్వీయ కవితా గానం, గోవర్ధనరావు నిడిగంటి చదివి వినిపించిన ”కరుణామయి ఉగాది” కవిత వీక్షకులను అలరించాయి. వీరితో పాటు చిన్నారులకు పద్యరచన లో శిక్షణ నిస్తున్న శ్రీ రమణ డీ ”మొదటి సారి లంగరెత్తుము” వంటి ప్రశాంత గానాన్ని అద్భుతంగా పాడటంతో నేటి ఉగాది కవి సమ్మేళనాన్ని వీక్షించిన అశేష సాహితీప్రియులు ఆనందంతో పారవశ్యులైనారని చెప్పక తప్పదు.
సాహితీప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 83 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ”మన తెలుగు సిరిసంపదలు” నేడు ప్రత్యేకతను సంతరించుకొంది. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ,పొడుపు కథలు సహా దాదాపు యాభై ప్రక్రియల లోని వైవిధ్య భరితమైన తెలుగు భాషా పదసంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది.
సంస్థ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ పొట్టిపాటి,ఉత్తరాధ్యక్షులుశ్రీమతి మాధవి లోకిరెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు సతీష్ బండారు, పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ తిరుమల రెడ్డి కొండా, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ఇంకా, శ్రీమతి శారదా సింగి రెడ్డి, ప్రొఫెసర్ రామ్ దంతు, కిరణ్మయి వేముల, గౌతమి పాణ్యం, స్వర్ణ అట్లూరి, రాజా రెడ్డి, హరి సింగం, రాజేష్ అడుసుమిల్లి, డాక్టర్ నక్త రాజు, పరమేష్ దేవినేని, అనంత్ మల్లవరపు, లెనిన్ బందా, రాజశేఖర్ మూలింటి, శ్రీధర్ ట్, ముక్కు శ్రీనివాస్, రాజా చంద్ర, రాంబాబు, ఉపేంద్ర, శ్రీనివాస్ డీ, కిరణ్, సంతోష్, రమణ డీ, నాగ సౌందర్య, శ్రీ జగదీశ్, శ్రీమతి సరోజ కొమరవోలు, శ్రీమతి సుధ, శ్రీమతి గీత దమ్మన, శ్రీమతి సువర్ణ విజయ, శ్రీమతి విజయ మామునూరి, వెంకట్ కొత్తూరు, శ్రీ నగేష్ పులిపాటి, నవీన్ గొడవర్తి, గోవర్ధనరావు నిడిగంటి వంటి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ పొట్టిపాటి తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.








