ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు
నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 17న జరిగిన 171 వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో విజయదశమి పండగ సందర్భంగా సంస్థ అద్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు సదస్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల పాడిన ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైదేహి శశిధర్ గారు విచ్చేశారు. ఉపద్రష్ట సత్యం గారు ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. వైదేహి శశిధర్ గారు జాషువా గారి ప్రఖ్యాత లఘు కావ్యం “పిరదౌసి” లోని పద్యాలను విశ్లేషిస్తూ చక్కటి ఉపన్యాసం చేశారు. వృత్తి రీత్యా వైద్యులైనా సాహిత్యం పై వారికున్న అవగాహన, ప్రసంగ పటిమ సభికులను విశేషంగా ఆకర్షించాయి. తరువాతి అంశంగా లెనిన్ వేముల ప్రసంగిస్తూ సరస్వతీ దేవిని స్తుతించే పద్యాలు ఆలిపించారు. “పద్య సౌగంధం” శీర్షికన శ్రీ ఉపద్రష్ట సత్యం గారు కృష్ణ రాయలి వారి ఆముక్త మాల్యద నుండి ఒక పద్యం యొక్క తాత్పర్య విశేషాలు విశ్లేషించారు.
“మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి గారు కొన్ని పొడుపుకథలు, ప్రహేళికలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభ్యులను భాగంచేశారు. కొమరవోలు సరోజ గారు గారు పుస్తక పరిచయం చేస్తూ “దీపతోరణం” అనే వంద మంది రచయిత్రుల కథా సంకలనం గురించి వివరించారు. కార్యక్రమంలో చివరి అంశంగా మాసానికో మహనీయుడు శీర్షికన ఈమాసంలో జన్మించిన విశిష్ట రచయితలను శ్రీమతి అరుణ జ్యోతి గారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట ముఖ్య అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపంచారు.
సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి వారు ముఖ్య అతిథి శ్రీమతి వైదేహి శశిధర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.













