విద్యార్థిని ప్రసంగంతో మురిసిన టాంటెక్స్ సాహిత్యవేదిక
డాలస్‌లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు సెప్టెంబరు 16వ తేదీన సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా జరిగిది. కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ”కట్టెదురా వైకుంఠం”, ”అన్నమయ్య కృతి” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మన తెలుగు సిరి సంపదలు శీర్షికన నానుడి, జాతీయాలు, పొడుపు కథలతో డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, డా. ఉమాదేవి బల్లూరి ఆధ్వర్యంలో సాగిన సదస్సు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. దయాకర్ మాడ ‘చాటువుల’ గురించి మాట్లాడుతూ రకరకాల ఇతివృత్తాలను సోదాహరణంగా వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని చదివి దాని అర్ధం వివరించారు. తెలుగు శాసనాల చరిత్ర, పరిణామక్రమాన్ని లెనిన్ వేముల వివరించారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి వి.ఆర్.విద్యార్థినిని సాహిత్య వేదిక బృందం సభ్యుడు దయాకర్ మాడ సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన కాళోజీ, శేషేంద్ర, అంపశయ్య నవీన్, పోట్లపల్లి రామారావు, మరికొందరు ఈతరం కవులు, రచయితల సాహిత్యం గురించి చర్చించారు. టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలక మండలి సభ్యులు శాలువా, జ్ఞాపికతో ఆయనను ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ సాహిత్యానికి వి.ఆర్.విద్యార్థి చేస్తున్న సేవలను కొనియాడారు.
సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు టాంటెక్స్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.













