“ఆధునిక తెలుగు సాహిత్యంలో కొందరు ప్రముఖులు”
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 134వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, సెప్టెంబరు 16 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 134 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.
కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర “కట్టెదురా వైకుంటము”, “అన్నమయ్య క్రుతి” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దీపావళి గురించి రాసిన స్వీయ కవిత చదివి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. డా. ఉమాదేవి బల్లూరి గారు చదివి వాటి అర్ధం ప్రశ్నలు సమాధానాలు అడుగుతూ సభ్యులను తమ చమత్కారమైన సమధాలనాలతో ఆనందభరితులను చేశారు. దయాకర్ మాడ గారు ‘చాటువుల ‘ గురించి మాట్లాడుతూ రక రకాల ఇతివృత్తాలను సోదాహరణంగా వివరించారు. చివరగా బావపై బావమరిది రాసిన పద్యం చదివి దాని భావాన్ని వివరించి నవ్వించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యద లోని ఒక పద్యాన్ని చదివి దాని అర్ధం వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.
సాహిత్య వేదిక బృంద సభ్యుడు దయాకర్ మాడ ముఖ్య అతిథి శ్రీ వి.ఆర్.విధ్యార్ధి ని సభకు పరిచయం చేశారు. నెలనెలా తెలుగు వెన్నెల సాహితీ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖక కవి శ్రీ వి.ఆర్.విధ్యార్ధి తమ ఉపన్యాసంలో ప్రపంచ సాహిత్య పునాదులు,ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్ఛాత్య ఆధునిక సాహిత్య ప్రభావాలు, ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలగు వారి ప్రస్తావన తెస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక్కో మార్గంలో ప్రముఖులైన కాళోజీ, శేషేంద్ర, అంపశయ్య నవీన్, పోట్లపల్లి రామారావు మరియు కొందరు ఈతరం కవులు, రచయితల సాహిత్యం గురించి చర్చించారు. ఇంకా అమెరికాలో జరుగుతున్న తెలుగు సాహిత్య క్రుషిని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దుడై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.
శ్రీ వి.ఆర్. విధ్యార్ధి గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శ్రీమతి శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. శ్రీ వి.ఆర్.విధ్యార్ధి గారు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి శీలం మాట్లాడుతూ శ్రీ వి.ఆర్.విధ్యార్ధి గారి సేవలను ఎంతో కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.
టాంటెక్స్ 134 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి సాహిత్య వేదిక బృంద సభ్యుడు శ్రీ మాడ దయాకర్ సమర్పించిన నివేదిక.













