నోవీలో తానా వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్… అధినాయకుల హాజరు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకుడు, కీర్తిశేషులు సుధాకర్ కాట్రగడ్డ సేవలను స్మరించుకుంటూ ఆయన పేరుమీద తానా నాయకులు వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ను నోవీలో ఘనంగా నిర్వహించారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట ఆధ్వర్యంలో ఈ టోర్న మెంట్ జరిగింది. నోవి నగరంలో స్పార్క్ అరీనాలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు క్రీడాకారుల నుంచి విశేషమైన స్పందన లభించింది. 37 టీమ్ లు, 500 మంది ప్లేయర్ లతో స్టేడియం మెరిసింది. మిషిగన్ అటార్ని జనరల్ డేనా నెసేల్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. తానా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంను ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ నిస్వార్థ సేవా ధృక్పథానికి, స్నేహశీలతకు, మంచితనానికి మారుపేరు సుధాకర్ కాట్రగడ్డ అని, ఆయన తానాకు చేసిన సేవలు ఎంతో విలువైనవి. ఎన్నో సేవలతో అశేషమైన తానా సభ్యుల అభిమానాన్ని ఆయన పొందారని కొనియాడారు. వారి సేవలకు గుర్తింపుగా వారి పేరు మీద వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టోర్న మెంట్ ద్వారా వచ్చిన విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు(ప్రభుత్వ హాస్పిటల్లలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం) కోసం వినియోగించడం జరుగుతుందని తెలిపారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తానా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ నిర్వాహకులకు అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రోత్సాహంతో జరిగింది. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని ఇతర స్థానిక తానా నాయకులు ఇతర పెద్దలు హాజరై ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.













