తానా సహకారం కోరిన.. నటుడు సోనూసూద్
హైదరాబాద్‌లో తమ ఫౌండేషన్ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సహకారం అందించాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ని ప్రముఖ సినీ నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ కోరారు. తానా ఈసీ సభ్యులు సోనూసూద్‌తో జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సోనూ సూద్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూలీలు, కార్మికుల అవసరాలు తీరుస్తున్న సమయంలో వైద్య అవసరాలకు, శస్త్ర చికిత్సలకు సహాయం చేయాలని వినతులు వచ్చాయని తెలిపారు. గత కొన్ని నెలల్లో అనేక ఆస్పత్రులలో శస్త్రచికిత్సలు చేయించానని తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలోనే 18 కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయించాం. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నానని తెలిపారు. అందులో ఒకట్రెండు వైద్య విభాగాల నిర్మాణానికి, వసతుల కల్పనకు అవసరమైన సహకారం అందిస్తే వాటికి తానా బ్లాక్‌లని పేర్లు పెడతాం అని పేర్కొన్నారు.
ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించేందుకు తానా సుముఖంగా ఉందని, దీనిపై తమ ఫౌండేషన్ సభ్యులతోను చర్చిస్తామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా ఉపాధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి సతీష్, కోశాధికారి అశోక్‌బాబు, ఈసీ సభ్యులు రామ్ చౌదరి, సాంస్క•తిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల తదితరులు పాల్గొన్నారు.













