తానా భవన్ నిర్మించడమే నా లక్ష్యం – సతీష్ వేమన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత సతీష్ వేమన ఆధ్వర్యంలో తానా 22వ మహాసభలను వాషింగ్టన్ డీసిలో నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు మరో ప్రత్యేకత ఉంది. కమ్యూనిటీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సతీష్ వేమన నాయకత్వంలోని యువ టీమ్ ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తోంది. గతంలోకన్నా భిన్నంగా ఈ మహాసభలు ఉండాలని ఈ టీమ్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను చేస్తోంది. మహాసభలకోసం ఏర్పాటు చేసిన తొలి సన్నాహక సమావేశమే విజయవంతం కావడం, విరాళాల సేకరణలో రికార్డులకెక్కడం ఈ టీమ్‌కు కమ్యూనిటీలో ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. రెండు గంటల్లోనే 3.2 మిలియన్ డాలర్లను ఈ సమావేశంలో సేకరించడం సతీష్ వేమన పనితీరును తెలియజేస్తోంది. తానే స్వయంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం, అతిధులను, తానా పెద్దలను ఆహ్వానించి మాట్లాడించడం వంటివి చేసి అందరి ప్రశంసలను సతీష్ వేమన అందుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు సతీష్ వేమనతో ‘తెలుగు టైమ్స్’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.
తానా మహాసభలను ఏ విధంగా నిర్వహించనున్నారు?
తానా 22వ మహాసభలు వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు వాల్తర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ మహాసభలను మరచిపోలేని విధంగా, చరిత్రాత్మకంగా నిర్వహించనున్నాము. సామాజిక సేవ, కళాపోషణ, భాషా పరిరక్షణకు తానా చేస్తున్న సేవలను మరోసారి ఈ మహాసభల ద్వారా తెలియజేయనున్నాము. ఈ మహాసభల కోసం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను ప్రారంభించాము. వాషింగ్టన్ డీసికి చెందిన తెలుగు ప్రముఖులు మూల్పూరి వెంకట్రావు తానా మహాసభల సమన్వయకర్తగా, కాన్ఫరెన్స్ చైర్మన్‌గా నరేన్ కొడాలి, కాన్ఫరెన్స్ సలహాదారుగా హేమప్రసాద్ ఎడ్ల వ్యవహరిస్తున్నారు.
అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మహాసభలు జరుగుతున్నందుకు అందుకు తగ్గట్టుగానే ఖర్చుకూడా ఉంటుంది. అందువల్ల ఈ మహాసభల కోసం అందరినుంచి విరాళాలను సేకరిస్తున్నాము. ఈ మహాసభలకు దాదాపు 3.5 మిలియన్ నుంచి 4 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాము. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్‌డీసిలోని తానా టీమ్ ఇందుకు తగ్గట్టుగా విరాళాలను సేకరిస్తోంది.
తానా మహాసభలకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు?
పెద్దఎత్తున నిర్వహించే ఈ మహాసభలకు దాదాపు 16,000మంది నుంచి 18,000 మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నాము. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులను, ప్రముఖులను కూడా ఈ మహాసభల కోసం ఆహ్వానిస్తున్నాము.
చైతన్యస్రవంతి సమావేశం వివరాలు తెలపండి?
ఆదరణ కోల్పోతున్న కళలను పైకి తీసుకువచ్చేందుకు ‘తానా’ చేపట్టిన కార్యక్రమం చైతన్యస్రవంతి. మన రాష్ట్రంలోని కళాకారులను ఈ కార్యక్రమం ద్వారా పైకి తీసుకువస్తున్నాము. ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ముందు ఈ చైతన్యస్రవంతి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతాయి. ఈసారి కూడా చైతన్యస్రవంతి కార్యక్రమాలను డిసెంబర్ 23 నుంచి జనవరి 7వ తేదీ వరకు జరుపుతున్నాము. హైదరాబాద్, అమరావతి, తాళ్ళపాక, వైజాగ్, ఖమ్మంతోపాటు మిగతా చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
మీ లక్ష్యం ఏమిటి?
తానాకు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. కమ్యూనిటీలో అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక తానా చేస్తున్న సేవలకు ఎల్లలు లేవు. తానా కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ఎప్పటినుంచో అనుకున్నాము. ‘తానా భవన్’ పేరుతో నిర్మించే ఈ భవనానికి కావాల్సిన నిధులను నా హయాంలోనే అందించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగా తానా మహాసభల సన్నాహక సమావేశంలోనే భవన నిర్మాణానికి కూడా విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరాను. దీనికి మంచి స్పందనే వచ్చింది. చాలామంది తానా పెద్దలు, ఇతరులు తమవంతుగా భవన నిర్మాణం కోసం విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రికార్డు స్థాయిలో దాదాపు 3.2 మిలియన్ డాలర్లు విరాళంగా వస్తున్నట్లు హామీలు లభించాయి. కేవలం 2 గంటల్లోనే ఈ హామీలు లభించడం తానా చరిత్రలో, తెలుగు సంఘాల చరిత్రలోనే రికార్డు అని చెప్పవచ్చు. దీంతోపాటు 700000 డాలర్లు లేదా 800000 డాలర్లు విరాళంగా రానున్నాయి. దీనికి సంబంధించి దాతలు ఇప్పటికే హామీలిచ్చారు. దీంతోపాటు పలు నగరాల్లో పర్యటించి దాదాపు 1 మిలియన్ డాలర్లను ఇందుకోసం వసూలు చేయాలని నిర్ణయించాము. కాన్ఫరెన్స్ నిర్వహణలో భాగంగా నిర్వహించే రిజిస్ట్రేషన్స్, ఎగ్జిబిట్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మరో 1 మిలియన్ డాలర్లు వసూలవుతాయని అంచనా వేస్తున్నాము. మొత్తం మీద మేము 6 మిలియన్ డాలర్లను వసూలు చేయాలని అనుకుంటున్నాము. కాన్ఫరెన్స్ నిర్వహణకు, తానా భవన నిర్మాణానికి ఉపయోగిస్తాము.