గోకర్ణేశ్వర ఆలయ నిర్మాణానికి సతీష్ వేమన విరాళం రూ.15 లక్షలు
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం బి.కమ్మపల్లె గొంగడాయిగుట్టపై నిర్మిస్తున్న గోకర్ణేశ్వర ఆలయ నిర్మాణానికి తానా అధ్యక్షుడు వేమన సతీష్ దంపతులు 15 లక్షల రూపాయలు విరాళంగా చెక్కును అందజేశారు. బి.కమ్మపల్లె సమీపంలోని గొంగడాయి గుట్టపై 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన గోకర్ణేశ్వర ఆలయ శిథిలాలు బయటపడ్డాయి. గోకర్ణేశ్వర గర్భగుడి అవశేషాలు, గుడి నిర్మాణానికి ఉపయోగించి రాతి దూలాలతో పాటు స్వామి వారి రాతి విగ్రహం ఉన్నాయి. స్వామి వారి రాతి విగ్రహానికి గ్రామస్తులు పూజలు నిర్వహించి అదే ప్రాంతంలో గుడి నిర్మాణానికి సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా గుడిపైకి గ్రామస్తులు యంత్రాలతో దారి ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కోసం బోరు వేశారు. మోటారు అమర్చి తానా అధ్యక్షుడు సతీష్ ఆయన సతీమణి నీలిమ చనుమోలు చేత పూజలు నిర్వహించి తాగు నీటి మోటారు ప్రారంభించారు.
అనంతరం గ్రామస్తులతో గుడి నిర్మాణం పనులపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామ పెద్దలు మాట్లాడుతూ గోకర్ణేశ్వర ఆలయం నిర్మాణానికి సుమారు 45 లక్షలు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీనిపై సతీష్ వేమన స్పందిస్తూ, కన్న తల్లి లాంటి గ్రామానికి ఎంత చేసినా తక్కువనేనన్నారు. నా వంతుగా 15 లక్షలు ఇస్తాను. వీలైతే నిర్మాణ దశలో మరికొంత సహాయం చేస్తానన్నారు. అందరూ కలిసి కట్టుగా ఆలయాన్ని మహాశివరాత్రికి పూర్తి చేసి అదే రోజు ఆలయం ప్రారంభించేటట్లు చూడాలన్నారు. దీంతో గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వేమన సతీస్ సతీమణి నీలిమ చేత గ్రామ పెద్దలకు చెక్కును అందజేశారు.













