మూర్తి భౌతికకాయం తరలింపునకు కృషి చేస్తున్న ‘తానా’
అమెరికాలోని అలస్కాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు, ‘గీతం’ వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తి పార్ధివదేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటితోపాటు తానా ట్రెజరర్ రవి పొట్లూరి కూడా ఈ మృతదేహాల తరలింపులో పాల్గొంటున్నారు. కాగా ఆదివారం నాటికి విశాఖకు ఆయన భౌతికకాయం చేరుకోవచ్చునని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆ రోజు కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచి, మరుసటి రోజు సోమవారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. మూర్తి భౌతికకాయాన్ని అలస్కా స్టేట్ ఆస్పత్రిలో భద్రపరిచిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు వాహనంలో ప్రయాణిస్తూ ప్రమాదంలో మరణించిన వీపీఆర్ చౌదరి అలియాస్ చిన్నా, వీరమాచనేని శివప్రసాద్, వెలువోలు బసవపున్నయ్య మృతదేహాలూ ఇదే ఆస్పత్రిలో ఉన్నాయి.
భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం మూర్తి మనవడు భరద్వాజ్ ఈ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన వెంట ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు ఉన్నారు. వీరంతా 12 గంటలు కారులో ప్రయాణించి అలస్కా ఆస్పత్రికి చేరుకొన్నారు. కుక్ ఇంటెల్ ఫ్యూనరల్ సర్వీసెస్ లో భద్రపరిచిన పార్ధివ దేహాలను స్వాధీనం చేసుకోడానికి అవసరమైన అధికారిక పత్రాలను అధికారులకు అందజేశారు. అక్కడి అధికారుల నుంచి మూర్తి, చౌదరి, శివప్రసాద్‌ల భౌతికకాయాలను స్వాధీనం చేసుకుని శాన్ఫ్రాన్సిస్కోకు తరలించనున్నారు. బసవపున్నయ్య మ తదేహాన్ని అమెరికాలోని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీంతో భరద్వాజ్, తానా ప్రతినిధులు తమ వెంట మూడు భౌతికకాయాలతో అలస్కా నుంచి శాన్ఫ్రాన్సిస్కో చేరుకొంటారు.
అక్కడినుంచి ఢిల్లీకి నేరుగా ఎయిర్ ఇండియా విమానం ఉంది. సాధారణంగా భారత్‌కు మృతదేహాలను తీసుకురావాలంటే ముందుగా పాస్‌పోర్టులు రద్దు చేయాలి. అలాగే మృతదేహాలను విమానంలో తీసుకురావడానికి శాన్ఫ్రాన్సిస్కో ఫ్యూనరల్ హౌస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ సకాలంలో పూర్తి అయితే, మూర్తి పార్ధివదేహం ఆదివారంనాటికి విశాఖ రావచ్చునని భావిస్తున్నారు.
కాగా, మూర్తి తదితరులతో ప్రయాణిస్తూ, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నంను(గాంధీ) ‘తానా’ అధ్యక్షుడు సతీశ్ వేమన, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, రవి పొట్లూరి పరామర్శించారు.













