TANA: తానా మహాసభల్లో పాఠశాల
మాతృభాష విశిష్టతను తెలియజేసేలా తానా (TANA) మహాసభల్లో ఏర్పాటు చేసిన ‘పాఠశాల’ (Paatasala) స్టాల్ ఆకట్టుకుంది. అమెరికాలోని డెట్రాయిట్‌లో మూడు రోజుల పాటు తానా 24వ మహాసభలు జరిగాయి. భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రారంభించారు. భాషే బంధానికి మూలమని శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య అన్నారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. భాష వారసత్వ సాంస్కృతిక సంపద.
ఈ తరానికి, గడచిన తరాలకూ మధ్య భాషే వారధి. సౌమ్య మాట్లాడుతూ.. మన పిల్లలకు ఏ భాషలో విద్యా బోధన చేసినా వారికి చక్కని తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఇక్కడి సమాజంపై ఉందన్నారు. అందుకు తానా – పాఠశాల ఈ బాధ్యతను స్వీకరించి ఉదాత్తంగా పనిచేయటం అభినందనీయమన్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ భాషను చంపేతరంగా మనం మిగిలి పోకూడదని హితవు పలికారు. ప్రవాసాంధ్రులు తెలుగు భాషను, కళలను తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు, భక్త భల్ల, సతీష్ చింతా, వెంకట్ కోగంటి, నాగ పంచుమర్తి, సునీల్ దేవరపల్లి, రంజిత్ కోమటి , రావు యలమంచిలి తో పాటు పాఠశాల అధ్యాపకులు గీత మాధవి, రజని, అమృత, శ్రీ రంజిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల బాలికలకు తెలుగు పుస్తకాలు పంపిణీ చేశారు.







