కాలిఫోర్నియాలో ఘనంగా దసరా దీపావళి ధమాకా వేడుకలు
అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో, ఏఐఏ సహకారంతో ‘దసరా, దీపావళి ధమాకా-2022’ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు కాంగ్రెస్‌మెన్ రో ఖన్నా, ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్, అలమెడా కౌంటీ సూపర్ వైజర్ డేవిడ్ హాబర్ట్తోపాటు బే ఏరియాకు చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు. తానా నార్తర్న్ కాలిఫోర్నియా రిజనల్ రిప్రజంటేటివ్ రామ్ తోట నేతృత్వంలోని తెలుగు వాలంటీర్లు, తానా బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా 25 అడుగుల ఎత్తయిన రావణ దహనం జరిగింది. అనంతరం బాణాసంచా, రథయాత్ర, రామ్ లీల కార్యక్రమాలు జరిగాయి. అక్టోబర్ 15న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆసాంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ వేడుకల్లో రకరకాల ఆటపాటలతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు 45 వేల మందికిపైగా ప్రేక్షకులు హాజరవడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు ధన్యవాదాలు తెలిపారు.













