నవనీతకృష్ణకు తానా నాయకుల నివాళి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు నవనీతకృష్ణ గొర్రెపాటి మృతిపట్ల పలువురు తానా నాయకులు సంతాపం తెలియజేస్తూ, ఆయన సంఘానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఇర్వింగ్లోని తానా-డల్లాస్ ప్రవాసాంధ్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.నవనీతక ష్ణ సంస్మరణ సభలో తానా ప్రతినిధులతో పాటు ఎంతోమంది పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రామ్ తాతినేని సమన్వయంలో సాగిన ఈ సభలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి మాట్లాడుతూ అందమే ఆనందం అంటారని కానీ నవనీతకు ఆనందమే అందమని కొనియాడారు. కాకినాడలో చదువుకునే రోజుల నుండి ఆయనతో పరిచయం ఉందని పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ నవనీత విగ్రహాన్ని ఘంటసాలలో ఆయన కుటుంబ సభ్యులు కోరుకున్న చోట ఏర్పాటు చేసే బాధ్యతను సంస్థ తరఫున తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జయరాం కోమటి మాట్లాడుతూ శాంతాక్లారాలో 2003 తానా మహాసభల్లో నవనీత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన నేతత్వంలో తాను పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. మరో మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఆయన మృతి తానాకు, డల్లాస్ ప్రవాసాంధ్రులకు తీరని లోటు అని అన్నారు. తానా బోర్డు ఛైర్మన్ చలపతి కొండ్రుకుంట, మురళీ వెన్నం, టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు తదితరులు కూడా ఈ?కార్యక్రమంలో ప్రసంగించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.













