కాకర్ల సుబ్బారావు మృతిపట్ల తానా నాయకుల సంతాపం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డా. కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు (16వ తేదీ) ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. 1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ నిమ్స్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్ లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్ ను తీసుకొచ్చారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు, జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు రాసిన డాక్టర్ కాకర్ల దేశ.. విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. 50 ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సత్కారాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి వేదిక ఉండాలన్న ఆశయంతో ఏర్పాటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వ్యవస్థాపకులలో ఒకరిగా కాకర్ల సుబ్బారావు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు తానా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జయ్ తాళ్ళూరి, అంజయ్య చౌదరి లావు, నిరంజన్ శృంగవరపు, సతీష్ వేమన తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. మాజీ అధ్యక్షులు, సహ వ్యవస్థాపకులు గుత్తికొండ రవీంద్రనాధ్, ముక్కామల అప్పారావు తదితరులు కూడా సంతాపాన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు. ఎన్నారైలతోపాటు స్వదేశంలోని తెలుగువారి కోసం సుబ్బారావు చేసిన సేవలు ఎనలేనివని జయరాం కోమటి కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన సుబ్బారావు మృతి ఎన్నారైలతోపాటు తెలుగువారందరికీ తీరని లోటని అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు జయరాం కోమటి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













