‘అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు’ కార్యక్రమానికి తానా శ్రీకారం
అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనంగా ఉన్న న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో తానా వారు ‘‘అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు’’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా న్యూట్రెండ్ను అక్కడివారికి పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా బోస్టన్ సమీపంలో ఉన్న వెస్ట్బరో లైబ్రరీకి అనేక తెలుగు పుస్తకాలను అందించారు. ఆంగ్ల తెలుగు నిఘంటువు, వేమన పద్యాలు, చందమామ కథలు, పెద్ద బాల శిక్ష ఇలా మరెన్నో పుస్తకాలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో న్యూ ఇంగ్లాండ్‌లో ఉన్న అనేక లైబ్రరీలలో తెలుగు పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తానా నడుం బిగించింది.
తెలుగు మాతృభాషా ప్రజలందరూ మన భాషను కాపాడుకోవడానికి అందరము నడుం బిగించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు పిలుపునిచ్చారు. తెలుగు భాషను, మన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఏదో చేబుతున్నాం అనే వొరవడి కాకుండా తెలుగు భాష పట్ల పిల్లలకు చిన్నపుడు నుంచి శ్రద్ధ కలిపించాలని తెలిపారు. తెలుగు పిల్లలందరికీ మాతృ భాషలోని మాధుర్యాన్ని నేర్పించాలన్నారు. ‘‘నా కుటుంబం నా తెలుగు’’ లాంటి మనస్తత్వం పిల్లలకు నేర్పించాలని కోరారు. మాతృభాష మాధుర్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు వివరించగలరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయప్రోలు సుబ్బారావు గారి ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలుగు భాష కోసం ఎందరో పండితులు, విద్వాంసులు, ఉపాధ్యాయులు తమ జీవితాన్నంతా ధార బోశారు. తెలుగు గురించి వారి బోధనలన్నీ చాలా విలువైనవి, వెల కట్టలేనివి, పర భాష పర భాషే.. మాతృభాష మాతృత్వానికి నిదర్శనం అని అన్నారు.
ఈ లైబ్రరీలో మీకు అవసరమైన తెలుగు పుస్తకం దొరకకపోతే మరియు ఎవరికైనా తెలుగు పుస్తకం కావాలంటే దయచేసి తానా ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ గడ్డంను తానా వెబ్ సైట్ (తానా.ఓఆర్‌జి)ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇంగ్లాండ్ తానా ప్రతినిధి ప్రదీప్ గడ్డం, కెపి సోంపల్లి, గోపి నెక్కలపూడి, విజయ్ బెజవాడ, శ్రీనివాస్ గొర్లే, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ నరేన్ కొడాలి, తానా అధ్యక్షుడు అంజయ్య లావు, రాజా కసుకుర్తి, అనిల్ ఉప్పలపాటి, భాను మొగలూరుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.













