తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు లక్ష మాస్క్ లు, నిత్యావసర వస్తువుల పంపిణీ
తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు
ఒకవైపు కరోనా వైరస్ భయం. మరోవైపు లాక్డౌన్తో జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని తెలుగువాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు తెలిపారు. అటు అమెరికాలో కూడా సేవలందిస్తూనే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తమవంతు సేవలందిస్తున్నామన్నారు.
అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, న్యూయార్క్, న్యూజెర్సీ, మిషిగాన్ వంటి రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. దానికితోడు లాక్డౌన్ ప్రారంభంలో యూనివర్సిటీలు హాస్టళ్ళను మూసేయడంతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ సమయంలో హోటళ్ల యాజమాన్యాలు, ప్రభుత్వాలతో మాట్లాడి వారికి తానా ఫౌండేషన్ ద్వారా ఆశ్రయం కల్పించే ఏర్పాట్లు చేశామని నిరంజన్ శృంగవరపు చెప్పారు. ఎవరికీ వైద్యం అవసరమైనా ఆన్లైన్లో స్పందిస్తున్నాం. అవసరమైన వారికి ఆర్థికపరంగా సాయం అందిస్తున్నాం. ఇక ఆంధప్రదేశ్, తెలంగాణల్లోనూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు లక్ష మాస్క్లు అందించామని తెలిపారు. వీటిలో 50 వేల మాస్కులను ఏపీ పోలీసు శాఖకు ఇచ్చామన్నారు. మిగతావాటిని పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.500 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను ఇచ్చినట్లు తెలిపారు. గోధుమపిండి, నూనె, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలతో కూడిన వస్తువులను ను విజయవాడ, హనుమాన్ జంక్షన్, భద్రాచలంలోని పేదలకు ఇచ్చామని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా స్వచ్ఛంద సంఘాలను ఎంపికచేసి వాటి ద్వారా మరిన్నిచోట్ల పేదలకు ఆర్థిక సాయం, ఆహారం అందిస్తున్నామని కూడా తెలిపారు.













