కరోనా వేళ…లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకుంటున్న తానా ఫౌండేషన్
అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సంక్షోభంతో తెలుగువారు అల్లాడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది నిరుపేదలు తినడానికి తిండలేక, రక్షణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తానా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వివిధ చోట్ల తానా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పలువురికి అన్నదానం చేస్తున్నారు. వివిధ చోట్ల పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతరులకు కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు వీలుగా మాస్క్‌లను పంపిణీ చేశారు.
విజయవాడ ప్రాంతంలో
కరోనా సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. విజయవాడలోని కామయ్యతోపు కట్ట వద్ద ఉన్న 55 నిరుపేద కుటుంబాలకు తానా ఫౌండేషన్ తరపున నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, రామ్‌చౌదరి ఉప్పుటూరి సహకారంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కందిపప్పు, ఉల్లిపాయలు, టమాట, బెండకాయ, సొరకాయ, అరటికాయ, ఉప్మారవ్వ, గోధుమపిండి, కుకింగ్ ఆయిల్, ప్రియ పచ్చడి, మిర్చి ని పంపిణీ చేసినట్లు బషీర్ షేక్ తెలిపారు. విజయవాడ హెల్ఫింగ్ హ్యాండ్స్వారు తానా ఫౌండేషన్ సహకారంతో పలువురికి అన్నదానం చేశారు.
ఒంగోలులో….
ఒంగోలులో కూడా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు, రాజస్థాన్ కుటుంబాలకు సహాయం అందించారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలో తానా ఫౌండేషన్ సహకారంతో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం గ్రామంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను వట్టిచెరుకూరు జడ్పిటీసి సీతామహాలక్ష్మీ ఉప్పుటూరి పేదలకు సామాగ్రిని అందజేశారు.
గుడివాడలో మాస్క్ లు పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడివాడలో కరోనా వైరస్ నుంచి రక్షణకు అవసరమైన మాస్క్‌లను పంపిణీ చేశారు. గుడివాడ సిఐ దుర్గారావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బందికి మాస్క్‌లను అందించినట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ వెంకట యార్లగడ్డ తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడంలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న పోలీసులకు మాస్క్ లు అందించడం సంతృప్తిగా ఉందని, తనకు ఈ అవకాశం ఇచ్చిన తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా నాయకులు గంగాధర్ నాదెళ్ళ, సతీష్ వేమన, రవి పొట్లూరికి వెంకట యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు.
పారిశుధ్య కార్మికులకు మాస్క్ లు పంపిణీ
రేపల్లె మునిసిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి తానా తరపున మాస్క్‌లను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













