TANA: తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావుకు తానా అభినందన సత్కారం
అమెరికాలోని తెలుగువారికోసం, తెలుగు సంఘాలు చేస్తున్న సేవ కార్యక్రమాలను గత 22 సంవత్సరాలుగా తెలుగు టైమ్స్ (Telugu Times) పత్రికతో, పోర్టల్ తో వార్తల రూపంలో అందిస్తున్న ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావును తానా మిడ్ అట్లాంటిక్ (TANA Mid Atlantic) టీమ్ అభినందనలు తెలియజేస్తూ సత్కరించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన తానా కార్యక్రమంలో ఆయనకు ఈ ప్రశంసాపూర్వక అభినందనలను తానా అందజేసింది. అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తూనే మరోవైపు వారిని తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తోంది. జన్మభూమిలో వారి సేవలు విస్తృతపరిచేందుకు ఆయన చేస్తున్న సేవలను తానా తెలియజేసింది.
అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో కూడా తెలుగు టైమ్స్ ఎడిటర్‌గా చెన్నూరి వెంకట సుబ్బారావు చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ తానా ఆయనను అభినందిస్తూ సత్కరించింది. తెలుగుటైమ్స్ ద్వారా వ్యాపారరంగంలో పేరు పొందిన తెలుగు ఎన్నారైలను టిటి బిజినెస్ అవార్డులతో ఆయన గత రెండు సంవత్సరాలుగా సత్కరిస్తున్న వివరాలను తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా న్యూజెర్సిలో నిర్వహించే టీటీ బిజినెస్ అవార్డుల వేడుకలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తానా నాయకులు గంగాధర్ నాదెళ్ళ, రవి పొట్లూరి, సునీల్ పాంట్రా తదితరులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.







