‘తానా’ సేవలు ప్రశంసనీయం : మంత్రి పువ్వాడ అజయ్

కరోనా లాంటి క్లిష్ట సమయంలో తానా (అమెరికా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంస్థ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతోందని, ఈ మహమ్మారి సాగుతున్న సమయంలో తానా చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రశంసలు కురిపించారు. తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, వెంటిలేటర్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
‘‘తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సహాయక చర్యలను చాలా దగ్గరగా కొన్ని సంవత్సరాల పాటు గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో. తానా అధ్యక్ష స్థానంలో ఉన్న జయశేఖర్ తాళ్లూరి నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఖమ్మం జిల్లాయే. కరోనాను దృష్టిలో పెట్టుకొని తానా సంస్థ అవసరమైన వారికి మెడికల్ కిట్స్, మాస్కులు, శానిటైజర్లు, ఆహార పొట్లాలు, నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసిందని విన్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నాను. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సట్రేటర్లను, వెంటిలేటర్లను కూడా కొన్ని రోజుల క్రితం పంపిణీ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. కోవిడ్‌ను అరికట్టడానికి, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగానే శ్రమిస్తోంది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం 10000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాబోయే రెండేళ్లలో వైద్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. తానా పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది’’ అని మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు.
భారత్‌కు సంబంధించిన తానా ట్రస్టీ శ్రీనాథ్ కుర్రా మాట్లాడుతూ.. 4 వారాల్లోగా తాము 700 ఆక్సిజన్ కాన్సట్రేటర్లను పంపిణీ చేశామని, ఇదంతా కూడా తానా అధ్యక్షుడు జై తాళ్లూరి సారథ్యంలోనే జరిగిందని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించగానే తమ సంస్థ అలర్ట్ అయ్యిందని, వెంటనే స్పందించి, అవసరమైన ఆస్పత్రులకు ఆక్సిజన్ కాన్సట్రేటర్లను, ఇతర వస్తువులను అందించామని పేర్కొన్నారు. తమ సంస్థలోని సభ్యులం ఒక్కో టీమ్‌గా ఏర్పడ్డామని, అందులో ఓ టీమ్ ఆయా ఆస్పత్రుల అవసరాలను చూస్తున్నామని, సరఫరాదారులతో నిత్యం సంప్రదింపులు జరుతోందని తెలిపారు. మరో టీమ్ దాతలను సంప్రదించడం, తానా సభ్యులను కదిలించడం, అవసరమైన డబ్బులను సమకూర్చే పనిలో నిమగ్నమైందని, మరో బృందం అవసరం ఉన్న వ్యక్తులను, ఆస్పత్రులను గుర్తించడం లాంటి పనులను విభజించుకున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తానా అధ్యక్షుడు జై తాళ్లూరి సాధ్యంలో సభ్యులం అందరమూ నిరంతరంగా పనిచేస్తున్నామని, తెలుగు రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో కూడా తాము పనిచేస్తున్నామని, తమకు అవసరమైన మార్గదర్శకాన్ని, అవసరాలను తీర్చిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు శ్రీనాథ్ కుర్రా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌తో పాటు ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అలేఖ్య హోమ్స్ అధినేత మహేశ్ కుర్రా, చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్‌తో పాటు ఇతర సంస్థలకు శ్రీనాథ్ కుర్రా కృతజ్ఞతలు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో తానా చాలా పెద్ద సంస్థ అని తెలుగు టైమ్స్ సంపాదకులు, పబ్లిషర్ చెన్నూరి వేంకట సుబ్బారావు పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో వివిధ కార్యక్రమాలు, సహాయార్థం తాము 200 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. తానా ఫౌండేషన్ చాలా సంవత్సరాలుగా చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. తానా సంస్థ చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ‘తెలుగు టైమ్స్’ 66 పేజీలతో ‘కరోనా సమయంలో తానా సేవలు’ పేరుతో ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశామని సంపాదకులు చెన్నూరి సుబ్బారావు తెలిపారు.