ధేనువకొండ పేదలకు తానా నిత్యావసరాల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఎన్నారై నాగరాజు నలజుల సహకారంతో ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ధేనువకొండకు చెందిన పేదలకు రెండు వారాలకు సరిపడా నిత్యాసరాలను అందజేశారు. పునరావాసకాలనీ బలరామకృష్ణాపురంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. కేశవరావు నేతృత్వంలో కందిపప్పు, నూనె, చింతపండు, కారం, పంచదార, ఉప్పు, మినపగుళ్లు, ఉల్లిపాయలు, పసుపు, గోధుమపిండితో కలిపిన సంచులు ఇంటింటికీ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, జొన్నలగడ్డ గోపీ, తుళ్లూరి వెంకటేశ్వర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ నాగరాజు కృషితో గతేడాది వ్యవసాయ కిట్లు, పాఠశాలకు అవసరమైన పరికరాలను అందించారన్నారు. ఇప్పుడు కరోనాతో ఉపాధి కోల్పోయిన 180 కుటుంబాలకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమన్నారు. ఫోన్ ద్వారా గ్రామవాసి ఎన్నారై నాగరాజు నలజుల మాట్లాడుతూ, తాను అమెరికాలో ఉంటున్నా, గ్రామస్థులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని చెప్పారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో ఈ సాయాన్ని అందించగలిగినట్లు చెప్పారు. తానా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.













