రోడ్డుప్రమాదంలో తానా బోర్డ్ సభ్యుడు కొడాలి నాగేంద్ర సతీమణి, కుమార్తెల మృతి
అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం ఉదయం 11:30 గంటలకు కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కురువుద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్, అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్త హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 20017 నుంచి తానా బోర్డులో పని చేస్తున్నారు.













