తానా ఆధ్వర్యంలో కాశీలో అన్నదానం కార్యక్రమానికి విశేష స్పందన
గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. పుష్కరాల ప్రారంభ సందర్భంగా స్థానిక శివాల ఘాట్లో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చినవారందరికీ చక్కటి భోజనాన్ని నిర్వాహకులు అందించారు. రాత్రిపూట కూడా అల్పాహారం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా పుల్లటి గుంట నుండి బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వచ్చిన వంట బృందం రుచికరమైన ఆహార పదార్థాలను తయారుచేసి అన్నదానంలో వడ్డిస్తోంది. ఆహారంతో పాటు చల్లటి మంచినీళ్లు సీసాలను కూడా అందిస్తున్నారు. కాశీలో ప్రసిద్ధ శివాల ఘాట్ ప్రక్కన ఉన్న మహానిర్వాణి ఘాట్లో గంగ పుష్కర యాత్రీకులకు అన్నదాన సేవలో పాల్గొంటున్నవారికి చక్కటి భోజనాన్ని తానా అందించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధులు లక్షలాది రూపాయల విరాళాలతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు పలువురు యాత్రికులు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు అన్నదాన శిబిరానికి హాజరై తమ ఆశీస్సులు అందిస్తున్నారు.













