ఉపయుక్తంగా తామా-మై ట్యాక్స్ ఫైలర్ వారి ట్యాక్స్ ఫైలింగ్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ సదస్సు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) మరియు మై ట్యాక్స్ ఫైలర్ వారు సంయుక్తంగా ట్యాక్స్ ఫైలింగ్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ సదస్సును ఫిబ్రవరి 22 న ఆల్ఫారెట్ట, జార్జియాలోని దేశానా మిడిల్ స్కూల్లో నిర్వహించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు పన్ను దాఖలు సమయం కావడం చేత, తామా వారు ఈ కార్యక్రమాన్ని సందర్భోచితంగా ముందుకి తీసుకు వచ్చారు. సుమారు 90 మందికి పైగా అట్లాంటావాసులు ఈ ప్రయోజనకర సదస్సులో పాల్గొని లబ్ది పొందారు. తామా మీడియా కార్యదర్శి హితేష్ వడ్లముడి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి, సదస్సు యొక్క సారాంశం మరియు అవసరం గురించి తెలియజేసారు. అలానే తామా చేసే వైద్యం, విద్య, వికాసం, వినోదం, విజ్ఞానం, సేవ, మహిళా కార్యక్రమాలు,. సదస్సులు, సాహిత్యం, సహాయం, సాంస్కృతిక మరియు ఆటపాటల గురించి క్లుప్తంగా వివరించారు. అటు పిమ్మట కార్యక్రమ ప్రధాన వక్త, ఆర్థిక మరియు పన్నుల నిపుణులు హరిప్రసాద్ సాలియన్ ని సభకు పరిచయం చేసి వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానించారు. ఆయన నేషన్-వైడ్ ఫ్రాంచైజీ మై ట్యాక్స్ ఫైలర్ నిర్వాహకులు, పైగా ఈ రంగంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులు.
మై ట్యాక్స్ ఫైలర్ అందించే విస్తృత సేవల వివరాలతో ఆరంభించి, 2019 పన్నులు మరియు సంబంధిత చట్టాల మార్పులు, 2020లో పన్ను కాలపరిమితులు ట్యాక్స్ క్రెడిట్స్, ట్యాక్స్ రేట్ టేబుల్ మరియు మినహాయింపుల గురించి విపులీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన ఈ పరస్పర చర్చలో ఫెడరల్ మరియు స్టేట్ రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రెంటల్ ప్రాపర్టీ రిటర్న్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మరియు సోల్ పార్ట్నర్షిప్ రిటర్న్స్, ఎఫ్బిఎఆర్, ఎఫ్ఎటిసిఎ, బిజినెస్ ట్యాక్స్ & సర్వీసెస్, ఎస్-కార్ప్ మరియు సి-కార్ప్ రిటర్న్స్, బుక్ కీపింగ్, పేరోల్ మరియు ఆడిట్ వంటివి చర్చకు వచ్చాయి.
పన్ను ఆదా చిట్కాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు ముఖ్యాంశాలుగా నిలిచాయి. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. సందర్శించే తల్లిదండ్రులు, పిల్లలు, పౌరులు, గ్రీన్ కార్డ్, వీసా హోల్డర్లు మరియు విద్యార్థులతో సహా చట్టబద్ధమైన నివాసితులకు పన్నులు ఏవిధంగా ఉంటాయో విడమరచి చెప్పారు. చాలామంది అందరికీ ప్రయోజనం కలిగించే ప్రశ్నలను అడిగారు. సామాన్యులకు అర్ధమయ్యే భాషలో హరిప్రసాద్ అందించిన చక్కటి వివరాలను అందరూ అభినందించి, వాటి వల్ల పొందగలిగే ప్రయోజనాలు మరియు పొదుపు గురించి మాట్లాడుకున్నారు. ప్రదర్శన తరువాత కూడా హరిప్రసాద్ ఎంతో ఓపికతో అనేక సందేహాలను నివృత్తి చేసి, సలహాలు ఇచ్చారు, తామా వారు విచ్చేసిన అందరికీ స్నాక్స్, మంచినీరు మరియు తేనీరు అందించారు.
ఉపయోగకరమైన సదస్సు అందజేసినందుకు హరిప్రసాద్ ని తామా బృందం ప్రశంసించి, మెమెంటో మరియు షాల్ తో సత్కరించింది. తామా బోర్డు మరియు ఇసి సభ్యులు కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, ఆనంద్ అక్కినేని, నగేష్ దొడ్డాక, మనోజ్ తాటికొండ, శ్రీరామ్ రొయ్యల, భరత్ మద్దినేని, సునీతా పొట్నూరు, ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, భరత్ అవిర్నేని, సురేష్ బండారు, తిరు చిల్లపల్లి, శుశృత్ బుసిరెడ్డి, సాయిరామ్ కారుమంచి తోపాటు ఎంతో మంది పాల్గొన్నారు. చివరగా హితేష్ ప్రధాన వక్త హరిప్రసాద్ ని, హాజరైన గ్రేటర్ అట్లాంటా ఇండియన్ కమ్యూనిటీని, తామా టీంని, వాలంటీర్స్ ని, అల్పాహారం అందించిన శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్ ని, దేశానా స్కూల్ యాజమాన్యాన్ని అభినందించి, కార్యక్రమాన్ని విజయవంతం గావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తామా రాబోయే కార్యక్రమాలు, హైకింగ్, వాలీబాల్, డయాబెటిస్, పేరెంటింగ్ సెమినార్లు మరియు ఉగాది గురించి సాయిరామ్ వివరించారు. మరిన్ని వివరములకు www.MyTaxFiler.com మరియు www.tama.org లను సందర్శించండి.













