రికార్డు స్థాయిలో తామా సంక్రాంతి సంబరాలు
అట్లాంటా తెలుగు సంఘం తామా (తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా) వారి సంక్రాంతి సంబరాలు జనవరి 21 న స్థానిక డెన్మార్క్ హైస్కూల్ లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు శేఖర్స్ రియాలిటి – శేఖర్ తాడిపర్తి, లావణ్య తాడిపర్తి గోల్డ్ స్పాన్సర్స్ గా, నార్త్ఈస్ట్ మార్ట్ గేజ్ – చిన్మయ మంచాల, రియల్ ట్యాక్స్ యాలీ – హరిప్రసాద్ శాలియన్, పిస్తా హౌస్ రెస్టారెంట్ – పవన్ యామన, భాను అంచ సిల్వర్ స్పాన్సర్స్ గా, హెచ్ సి రోబోటిక్స్ – వెంకట్ చుండి బ్రోన్జ్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు. మునుపెన్నడూ లేని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో గత రికార్డులను మెరుగుపరుస్తూ దాదాపు 2000 మంది ఉత్సాహభరితంగా పాల్గొనడం అట్లాంటా మరియూ 42 సంవత్సరాల తామా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 50 మందికి పైగా మహిళామణులు, చిన్నారులు పాల్గొని, వైవిధ్యంగా ముగ్గులు వేసి అలరించారు. స్కూల్ పిల్లల కోసం జరిగిన నాలెడ్జ్ బౌల్ లో 150 మందికి పైగా పాల్గొనడం ముదావహం. ఈ రెండు పోటీలలో గెలిచిన వారికి తామా వారు ప్రైజులు అందజేశారు. వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన 40 షాపింగ్ స్టాల్ల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా మంది రాఫుల్ టికెట్ల ద్వారా వివిధ బహుమతులు గెలుచుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా విశిష్ఠ అతిథి, ప్రముఖ టాలీవుడ్ గాయని గీతా మాధురి తో ఎందరో ఫోటోలు తీసుకున్నారు.
తామా సాంస్కృతిక కార్యదర్శి తిరు చిల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి, అందరినీ ఆహ్వానించారు. అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి తామా కార్యవర్గాన్ని, బోర్డు ట్రెజరర్ శ్రీనివాస్ ఉప్పు డైరెక్టర్లను సభకు పరిచయం చేశారు. గీతా మాధురి మరియూ తామ టీం జ్యోతి ప్రజ్వలన గావించారు. మొట్టమొదటి సారిగా వేదిక మీద భారత మరియూ అమెరికా దేశాల జండాలు పెట్టడం జరిగింది. స్థానిక కళాకారుల భక్తి గేయాలు, పద్యాలు, పాటలు, మెడ్లీలు, నాటకాలు, నృత్యాలు ఆహుతులందరినీ మంత్రముగ్దులను గావించాయి. ఎన్ టి ఆర్ శత జయంతి సందర్భంగా తామా వారు నివాళిగా చేసిన నట నాట్య పద ప్రదర్శన, నటరాజ నాట్యాంజలి వారు చేసిన సంక్రాంతి వైభవం నృత్య నాటకం విశేషంగా ఆకట్టుకున్నాయి. లావణ్య తన చురుకైన యాంకరింగ్ తో ఆకట్టుకున్నారు. తనతో పాటు యువతకు శిక్షణ ఇచ్చి, వారిని యాంకరింగ్ లో భాగం చేశారు. అట్లాంటాలోని ఏకైక తెలుగు బ్యాండ్ రిథమ్ అండ్ రాగా వారు తమ పాటలతో అలరించారు. విభిన్న పాటల మేళవింపుతో సాగిన మ్యూజికల్ నైట్ లో తన అద్భుత గానంతో దాదాపు రెండున్నర గంటల పాటు గీతా మాధురి ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించారు. ఎంతోమంది వేదిక మీదకు వచ్చి డ్యాన్స్ చేశారు.
గౌరవ అతిథులు జార్జియా హౌస్ రెప్రెసెంటేటివ్ కార్టర్ బారెట్, ఫోర్సైత్ కౌంటీ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యులు మైక్ వాల్డెన్, జాన్స్ క్రీక్ కౌన్సిల్ సభ్యులు దిలీప్ తున్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి, ఇంతమందిని ఒకే చోట కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తామా గత అధ్యక్షులు, ఛైర్మన్లు, కమిటీలవారు రావడం ఆనందదాయకం. యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత ఆవశ్యకతను ఆర్ట్ అఫ్ లివింగ్,హెచ్ టి ఎ వారు చెప్పారు. స్థానిక మరియూ జాతీయ సంస్థలు మైత్రి, గేట్స్, ఐఎఫ్ఎ, గాటా, తానా, ఆటా, టీడీఫ్, నాటా, టాటా, హెచ్ ప్యాక్, కన్నడ కూట నాయకులు విచ్చేసి అభినందనలు తెలియజేశారు. అలానే అతిథులందరినీ తామా వారు తగురీతిలో సత్కరించారు. ఈ సంవత్సరం యువతను మరింతగా ప్రోత్సహించడం వల్ల, వారు యాంకరింగ్ లో, ఫ్రంట్ డెస్క్ దగ్గర మరియూ భోజనాల వద్ద అత్యధిక సంఖ్యలో పాల్గొని సహాయం చేశారు. అధ్యక్షులు సాయిరామ్ వివిధ సందర్భాలలో మాట్లాడుతూ, తామాకి ప్రజలు, స్పాన్సర్లు, వాలంటీర్లు మరియూ తామా టీం నాలుగు స్థంభాలని చెప్తూ, విచ్చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. యువత అవసరం సంస్థలకు ఎంతగానో ఉందనీ, వారి కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామనీ, అలానే పెద్దవారి ఆశీర్వాదం, అనుభవం కావాలనీ, అందరూ యోగా,ధ్యానం చెయ్యాలని చెప్తూ, తామా తదుపరి కార్యక్రమాల వివరాలు విపులీకరించారు. బోర్డు ట్రెజరర్ శ్రీనివాస్ ఉప్పు తామా ఫ్రీ క్లినిక్, మనబడి, ఆటలు, సదస్సులు, స్కాలర్షిప్స్ మున్నగు విషయాలను విశదీకరించారు.
ఎప్పుడూ లేని విధంగా 3 రోజులు ముందుగానే స్టాల్ల్స్, 2 రోజుల ముందే నాలెడ్జ్ బౌల్, 1 రోజు ముందే టిక్కెట్లు, ముగ్గుల పోటీల రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేయడం గమనార్హం. పిస్తా హౌస్ రెస్టారెంట్ వారు రుచికరమైన భోజనాలు అందజేశారు. ఈవెంట్ సోల్డ్ అవుట్ అని ప్రచారం చేసినా కూడా చాలా మంది వాక్ ఇన్స్ రావడం వల్ల భోజనాల వద్ద కొంత ఆలస్యం, ఇబ్బంది ఎదురైనప్పటికీ, నిర్వాహకులు వెంటనే తగిన ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ బ్లాక్ బస్టర్ అనీ, అన్నీ అదిరి పోయాయనీ, ఇంతవరకు ఇలాంటి జనసందోహాన్ని చూడలేదని చాలా మంది చర్చించుకోవడం, తరువాత ఫోన్ల ద్వారా, మెసేజీల ద్వారా తెలపడం తామా టీం కి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చివరగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన ప్రేక్షకులు, స్పాన్సర్లు, ముఖ్య అతిధులు, వాలంటీర్లు, యాంకర్లు, తామా టీం, క్యూరీ లెర్నింగ్ విజిత, న్యాయనిర్ణేతలు రమా పవార్, హరిప్రియ దొడ్డాక, ఫోటోగ్రఫీ రవి వడ్డమాను, వీడియో వాకిటి క్రియేషన్స్, డెకొరేషన్ మధురమ ఈవెంట్స్, డీజే ఏ ఆర్ డాజిల్ ఈవెంట్స్, రిథమ్ అండ్ రాగా బ్యాండ్, మీడియా పార్ట్నర్స్కు ఉపాధ్యక్షులు సురేష్ బండారు ధన్యవాదాలు తెలిపి దిగ్విజయంగా ముగించారు.













