ఘనంగా ‘తామా’ సంక్రాంతి సంబరాలు
తెలుగువారి లోగిళ్ళ రంగవల్లుల భోగిళ్ళ సంక్రాంతి సంబరాలు అమెరికాలో అంబరాన్ని అంటాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) ఆధ్వర్యంలో జనవరి 20న అట్లాంటా లోని దేశాన మిడిల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహించారు. వణికించే చలిలో సైతం అమెరికా గడ్డపై తెలుగు సాంప్రదాయ పండుగను అత్యంత ఉత్సాహంగా రెండువేల పైచిలుకు తెలుగు వారు వచ్చి సంబరాలను విజయవంతం చేశారు. చిన్నపిల్లల భోగిపళ్ళతో, అందమైన రంగవల్లులతో, సాంప్రదాయ తెలుగు వారి పిండి వంటలతో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని అమెరికా గడ్డమీద చాటి చెప్పారు. ఈ సంబరాలకు ప్లాటినం స్పాన్సర్లుగా కలర్స్ బ్యూటీ సెలూన్, గోల్డ్ స్పాన్సర్స్ గా పిస్తా హౌస్, శేఖర్ రియాల్టీ, నార్త్ ఈస్ట్ మార్ట్ గేజ్ సిల్వర్ స్పాన్సర్స్ గా ట్రూవ్యూ ఫైనాన్సియల్ సొల్యూషన్స్, రియల్ టాక్స్ యాలి వ్యవహరించారు.
సంక్రాంతి పండుగ తెలుగు వారికి అతి పెద్ద పండుగ, కొత్త అల్లుళ్ల రాకతో పిండి వంటల ఘుమ ఘుమలతో చక్కటి రంగవల్లుల ముగ్గులతో తెలుగు వారంతా ఒకచోట చేరి సంక్రాంతి పండుగ జరుపుకోవడం శుభపరిణామం. తామా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదిక అలంకరణ పండుగ ఉట్టి పడేలాగా తెలుగు సాంప్రదాయాన్ని చాటేలాగా ఎంతో సర్వాంగ సుందరంగా ఉంది అని వచ్చిన వారు అనుకోవటం విశేషం.
ఈ సందర్భంగా తామా సంఘం మహిళా కార్యదర్శి సుమ పోతిని ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, చిత్రకళలను సాయిరామ్ కారుమంచి ఆధ్వర్యంలో, భోగిపళ్ల వేడుకను ప్రియాంక గడ్డం నేతృత్వంలో నిర్వహించగా 100 కి పైగా బాలలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు 50 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులతో తమ ప్రతిభ పాటవాలను చాటారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా తామా సంస్థ వారు చిన్నారులందరికీ మన తెలుగు సంస్కృతిని అందరికీ తెలియజేయటానికి గాలిపటాలను పంపిణీ చేశారు. శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి పర్యవేక్షణలో వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన ముప్ఫైపైగా స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్ధాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి సంబరాలను ముందుగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి జ్యోతి ప్రజ్వలన చేయుటకు అందరిని వేదిక పైకి ఆహ్వానించారు తర్వాత కార్యక్రమంలో సురేష్ బండారు కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులను ఆహుతులకు పరిచయం చేశారు.
అనంతరం తామా అధ్యక్షుడు సురేష్ బండారు మాట్లాడుతూ పాశ్చాత్య దేశంలో ఉన్నప్పటికీ తెలుగు మూలాలను మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. అలాగే తామా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉప్పు మాట్లాడుతూ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని దాని ఆవశ్యకతను వివరించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా సాంస్కృతిక ప్రదర్శనలు అందించి చిన్నారులు, మహిళలు మరియు పురుషులు తమ ప్రతిభ పాటలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాలతో అలంకరించి ఎన్టీఆర్ పాటలు పాడి ఘన నివాళులు అర్పించారు. తెలుగు గాయకులు ఉష, ప్రవీణ్ ఆలపించిన పాటలు ఉర్రూతలూగించాయి. పాటలకు చిన్నారులు మహిళలు పురుషులతో పాటు పెద్దలు సైతం నృత్యాలు చేశారు. తామా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఎద్దుల బండి ఆకృతిలోని కొండపల్లి బొమ్మలను స్పాన్సర్లకు అందజేయటం ఎంతో విశేషం.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫోర్సైత్ కౌంటీ కమీషనర్ టాడ్ లెవెంట్ ను శాలువాతో పాటు పుష్పగుచ్చాలు అందించి మరియు కొండపల్లి బొమ్మలను బహుకరించి ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరించిన పిస్తా హౌస్ వారి ఆధ్వర్యంలో వేడుకకు విచ్చేసిన వారందరికీ అందించిన విందు భోజనాలు రుచికరంగా ఉన్నాయని సంబరపడ్డారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, సురేష్ బండారు ,చలమయ్య బచ్చు, ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, సునీత పొట్నూరు, ప్రవీణ్ బొప్పన, రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, యశ్వంత్ జొన్నలగడ్డ, సుమ పోతిని, వెంకట శివ గోక్వాడ, కృష్ణ ఇనపకుతిక. పవన్ దేవులపల్లి, నగేష్ దొడ్డాక, సాయిరామ్ కారుమంచి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, మధు యార్లగడ్డ పాల్గొన్నారు.
చివరిగా సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన తామా బృందం స్పాన్సర్లు, అతిథులు, వాలంటీర్లు, ముఖ్య అతిధులు, ప్రేక్షకులందరికీ ఉపాధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి ధన్యవాదాలు తెలిపి ద్విగ్విజయంగా ముగించారు.







