వైభవంగా సాగిన తామా దసరా బతుకమ్మ వేడుకలు
                                    అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో శనివారం అక్టోబరు 5న స్థానిక దేశానా మిడిల్ స్కూల్ లో అత్యంత వైభవోపేతంగా, ఉత్సాహ భరితంగా నిర్వహించిన దసరా బతుకమ్మ వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. భారీగా 1500 మంది ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. కార్యక్రమానికి మహిళామణులు, చిన్నారులు చక్కగా ముస్తాబయ్యి, పలురకాల ఆకులతో, పూలతో ప్రకృతిసిద్ధంగా అందమైన బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజించి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.తామా వారు 2023 సంవత్సరంలో ప్రవేశపెట్టిన దసరా వేషాల పోటీలలో ఈ సంవత్సరం కూడా ఎంతో మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి ముందుకు వచ్చిన దాతలు గోల్డ్ స్పాన్సర్ డా. ప్రవీణ కొమ్మిడి గారు, సిల్వర్ స్పాన్సర్ ప్రదీప్ అరన్పల్లి గారు అభినందనీయులు.
మొదటగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి అందరినీ సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానించి, దసరా శరన్నవరాత్రుల గురించి, బతుకమ్మ విశిష్టత గురించి విపులంగా చెప్పారు. తామా అధ్యక్షులు సురేష్ బండారు ఆహుతులందరికీ శుభాకాంక్షలు తెలిపి, వారు చేస్తున్న విభిన్న కార్యక్రమాలను వివరించారు. తామా బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ ఉప్పు చేసే ఇతర సాంఘిక కార్యక్రమాలు, తామా ఫ్రీ క్లినిక్ మున్నగు వాటి గురించి వివరించారు. ఈ వేడుకలకు యాంకర్ గా ప్రియా మాధవ్ ఆద్యంతం అద్భు తంగా నిర్వహించారు. దసరా సందర్భంగా అట్లాంటా స్థానిక కళాకారులు నృత్యా లు, సంగీతం మరియూ ఆట పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా పృథ్వి కొండూరి, స్వాతి చెన్నూరి బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తామా వారు స్పాన్సర్స్ ని ఘనంగా సన్మానించారు. తామా మహిళా కార్యదర్శి సుమ పోతిని, ప్రధాన కార్యదర్శి సునీతా పొట్నూరు ఆధ్వర్యంలో జరిగిన తామా మాస్టర్ చెఫ్, తామా మహారాణి వంటి వినూత్న కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.
భారతదేశం నుంచి వచ్చిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం రూపశిల్పి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సలహాదారుడు అయిన శ్రీనివాసన్ చంద్రశేఖరన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరూ షాపింగ్ స్టాల్ల్స్ చుట్టూ కలియ తిరగడం, చిన్న పిల్లల కేరింతలు, పెద్దవారి పలకరింపులు చూసి, మనం తెలుగు నేల మీద ఉన్నామా లేక అమెరికా గడ్డ మీద ఉన్నామా అన్న సందేహం రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తామా కోశాధికారి తిరు చిల్లపల్లి మరియు శ్రీనివాస్ ఉప్పు వచ్చిన వారి అందరికి కోలాటం స్టిక్స్ అందచేయగా, బతుకమ్మ ఆట పాటలతో ఆడపడుచులు అందరూ ఎంతో హుషారుగా పాల్గొని, భక్తి శ్రద్ధలతో నిమజ్జనం గావించారు.పిల్లల దసరా వేషాల ప్రదర్శనలకు న్యాయనిర్ణేతలుగా ఐటీ కంపెనీ అధినేత, సినీనటుడు వెంకట్ దుగ్గిరెడ్డి, సిలికానాంధ్ర మనబడి, జార్జియా రాష్ట్ర ప్రాతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ల, మనబడి ఉపాధ్యాయురాలు గౌరీ బాణవతుల వ్యవహరించి బహుమతులు అందచేశారు. అలాగే తామా వారి దసరా వంటల పోటీలకు అనురాధ వల్లూరి గారు దాతగా ముందుకొచ్చినందుకు అభినందనలు. ఈ వంటల పోటీలో విరివిగా మహిళలు పాల్గొని వారి వారి వంటకాలు మరియు చిరుతిళ్ళును రుచి చూపించారు. విజేతలకు న్యాయనిర్ణేతలు జ్యోతి రెడ్డి, రేష్మ ఫరహీన్, పావని గోడే బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, తామా ఉపాధక్షుడు రూపేంద్ర వేములపల్లి అధ్వర్యంలో జరిగిన విందు భోజనాన్ని ఆరగించి, ఎంతో రుచిగా ఉంది అని మెచ్చుకున్నారు. మాలిని గారి గో గ్రీన్ బృందం అందరికి మంచినీళ్ళని అందించారు. విందు భోజనం ఏర్పాట్లను రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, నగేష్ దొడ్డాక, కృష్ణ ఇనపకుతిక, సత్య నాగేంద్ర గుత్తుల, చలమయ్య బచ్చు, రాఘవ తడవర్తి, సాయిరాం కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ, పవన్ దేవులపల్లి, మరియు ఇతర తామా వాలంటీర్స్ నిర్వహించారు.
ఇంతమంది వచ్చి దసరా, బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడం పట్ల తామా నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన అతిధులకు, వలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.







